వినోదా చందావత్. నేటి తరం వ్యాపారవేత్త. ఈ పేరు తెచ్చుకోడానికి ఎన్నో రోజులు శ్రమించింది. మరెన్నో ఆటుపోట్లు తట్టుకొని నిలబడింది. 2016లో మల్హరి మసాలాస్ పేరుతో వ్యాపారం మొదలుపెట్టిన వినోదా 13 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తుంది. తెలుగురాష్ట్రాలతో పాటు విదేశాలకు సైతం మసాలాలు ఎగుమతి చేస్తూ శభాష్ అనిపించుకుంటుంది. నమస్తే కిచెన్ పేరుతో మరో అంకుర సంస్థ ప్రారంభించి రుచికరమైన ఆహారం అందించేందుకు సిద్ధమైంది.
నిరుపేద కుటుంబంలో పుట్టిన వినోద. ముగ్గురు అక్కాచెల్లెళ్లలో పెద్దది. కుటుంబ పోషణ కోసం చేపలమ్ముతున్న తల్లిదండ్రులకు తోడుగా నిలిచింది. డిగ్రీ పూర్తి చేసిన వినోద హైదరాబాద్ లో సివిల్స్ కోచింగ్ తీసుకుంటూ తొలి ప్రయత్నంలోనే విజయం సాధించింది. కానీ సామాజిక వర్గంతో కాక తానేంటో నిరూపించుకోవాలనుకుంది. వెంటనే తనలక్ష్యం ఉద్యోగం కాదు..వ్యాపారం అని గ్రహించి ముందడుగు మల్హారీ మసాలాస్ పేరుతో వ్యాపారం ప్రారంభించింది.
మా తల్లిదండ్రులు మమ్మల్ని బాగా చదివించారు. కుమారుడు అయితేనే చేయగలుగుతారా.. నేనైతే చేయలేనా.. అనే నిర్ణయంతో.. చేపల వ్యాపారం చేశా.. తర్వాత మల్లారీ మసాలస్ పేరుతో వ్యాపారం చేశాను. - వినోద, మల్హరి మసాలాస్ వ్యవస్థాపకురాలు
వినోద మొదటగా సాప్ట్‌వేర్ ఉద్యోగులకు ఆహారం అందించే డబ్బా వాలా కాన్సెప్ట్ ప్రారంభించింది. అందులో నష్టాలు వస్తున్నాయని మసాలా వ్యాపారం చేయాలని నిర్ణయించుకొని మల్హరి మసాలాస్ పేరుతో ప్రాజెక్టు సిద్ధం చేసింది. వ్యాపారం చేయడానికి రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగింది. బ్యాంకర్లు రుణం ఇవ్వడానికి వెనకడుగు వేసినా.. వారిని ఒప్పించి 42 లక్షల రూపాయల రుణాన్ని పొందింది. వాటితో పాటు మరింత డబ్బు సేకరించి మల్హరి మసాలా వ్యాపారాన్ని స్థాపించింది.