ఈమె పేరు ముత్యాల అరుణ. అందరిలాగే... భర్త, పిల్లలతో అందమైన జీవితం గడపాలని ఊహించుకుంది. కానీ, కష్టాలు ఆమెను నీడలా వెంటాడాయి. ఆనందంగా జీవించాలన్న కోరిక కుటుంబ సభ్యుల మరణాలతో కనుమరుగయ్యాయి. అయినా ఆమె వెనకడుగు వేయలేదు. భర్త వృత్తినే బతుకుదెరువుగా మార్చుకొని భద్రాచలంలోని శ్మశాన వాటికలో కాటి కాపరిగా పనిచేస్తోంది. ధైర్యంగా అడుగు ముందుకేసి తాను బతకడమే కాదు మరో ఐదు కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోంది.
ఎవరూ చేయని సాహసం
అరుణకు చిన్న వయసులోనే రాజమండ్రికి చెందిన కాటికాపరి శ్రీనుతో వివాహమైంది. భద్రాచలం గోదావరి కరకట్ట వద్ద ఉన్న వైకుంఠ ఘాట్‌లో శ్రీను పని చేసేవాడు. అప్పుడప్పుడు భర్తతో శ్మశాన వాటికకు వెళ్లిన అరుణ.. సాయంగా కొన్ని పనులు చేసేది. అలా అన్ని పనులు నేర్చుకుంది. కొన్నాళ్లకు భర్త అనారోగ్యానికి గురై మంచం పట్టడంతో.... వైద్యం కోసం ఆపసోపాలు పడింది. ఇంటిని తాకట్టు పెట్టడంతో పాటు ఎన్నో చోట్ల అప్పులు చేసింది. అన్ని చేసినా భర్త మరణించడంతో ఏ ఆధారం లేక కుంగిపోయిన అరుణ ఎవరూ చేయని సాహసం చేసింది. అదే శ్మశాన వాటికలో కాటికాపరిగా పని చేస్తూ.... తాను బతకడమే కాదు మంచానికే పరిమితమైన తండ్రి బాగోగులు చూస్తోంది.