Singareni Selected for IEI Award: ఉత్తమ వాణిజ్య విలువలను పాటిస్తున్నందుకుగాను సింగరేణి సంస్థకు ప్రతిష్ఠాత్మక ఐఈఐ ఇండస్ట్రీ ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా (ఐఈఐ) ఏటా ప్రకటించే ఇండస్ట్రీ ఎక్స్‌లెన్స్ అవార్డు కోసం ఈ ఏడాదికి సింగరేణి సంస్థను ఎంపిక చేసింది. దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఆదివారం రోజు నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే చేతుల మీదుగా... సింగరేణి సంస్థ జీఎం కె.నాగభూషణ్‌రెడ్డి అందుకున్నారు. 36వ ఇండియన్ ఇంజినీరింగ్ కాంగ్రెస్ సమావేశం సందర్భంగా ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా ఆధ్వర్యంలో... ఇంజినీరింగ్ విభాగంలో మంచి పనితీరు కనబర్చిన పలు కంపెనీలకు ఈ అవార్డులను ప్రదానం చేశారు.
వృద్ధిలో దూసుకుపోతున్న సింగరేణి..
ఆంగ్లేయుల కాలంలో పురుడు పోసుకున్న సింగరేణి... తెలంగాణ కొంగు బంగారమై నిలుస్తోంది. గడిచిన ఏడేళ్లలో అత్యద్భుత ప్రగతి సాధించి దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలకు తలమానికంగా నిలిచింది. కరోనా కష్టకాలంలో సైతం ఇతర ప్రభుత్వ సంస్థల కంటే సింగరేణి మెరుగైన వృద్ధిని నమోదు చేసింది. ముఖ్యంగా అమ్మకాలు, లాభాల్లో తన చరిత్రలోనే ఆల్ టైం రికార్డుగా అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసింది. దేశంలోని 8 మహారత్న కంపెనీలు సాధించిన దానికన్న ఎంతో ఎక్కువ సాధించి సత్తా చాటుకొంది. గత ఏడేళ్లలో మహారత్న కంపెనీల లాభాలు, అమ్మకాల్లో సాధించిన వృద్ధి రేటుతో పోలిస్తే సింగరేణి అందనంత ఎత్తున నిలబడింది. లాభాల్లో వృద్ధిని పరిశీలిస్తే మహరత్న కంపెనీల్లో అగ్రగామి సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ గడచిన ఐదేళ్లలో 104.5 శాతం వృద్ధిని సాధించగా.. సింగరేణి 281.9 శాతం వృద్ధిని నమోదు చేసింది.