కరోనా వ్యాధితో ఏ ఒక్క కార్మికుడు, అధికారి మృతి చెందకూడదనే లక్ష్యంతో ప్రతీ అధికారి పనిచేయాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్ నుంచి డైరెక్టర్లు, ఏరియా జీఎంలతో సీఎండీ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. సింగరేణి మొత్తం కరోనా కట్టడికి కలిసికట్టుగా పనిచేయాలని సీఎండీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న కార్పొరేటు ఆస్పత్రులతో పాటు కరోనా రోగుల అత్యవసర సేవల కోసం, సాధ్యమైనన్ని ఎక్కువ సంఖ్యలో వెంటిలేటర్ సౌకర్యం గల ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు.
'సింగరేణి మొత్తం కరోనా కట్టడికి కలిసికట్టుగా పనిచేయాలి' - hyderabad news
సింగరేణి కాలరీస్ కంపెనీలో ఏ ఒక్క కార్మికుడు, అధికారి, అతని కుటుంబ సభ్యులు కరోనాకు బలి కాకూడదని అధికారులకు స్పష్టంచేశారు. అదే లక్ష్యంతో వారి రక్షణకు, వైద్య సేవలకు ఎంతటి ఖర్చుకైనా వెనుకాడకుండా కృషి చేయాలని... కరోనా వ్యాప్తి నివారణతో పాటు ప్రతీ ఒక్కరి రక్షణ బాధ్యతను స్థానిక యాజమాన్యాలు చేపట్టాలని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశించారు.
కనీసం 200 బెడ్లు సింగరేణి పేరుతో సంసిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. సింగరేణి ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నందున ప్రతి ఏరియాలో రోజుకి 200కు పైగా టెస్టులు నిర్వహించాలన్నారు. అవసరమైన ర్యాపిడ్ టెస్ట్ కిట్లు యాజమాన్యం సరఫరా చేస్తుందన్నారు. దీనితో పాటు ప్రతీ ఆసుపత్రిలో లేబోరేటరీ సౌకర్యాలు విస్తరించాలని పేర్కొన్నారు. అవసరమైతే ప్రైవేటు ల్యాబ్ టెక్నిషియన్లను నియమించుకోవాలన్నారు. అన్ని కంపెనీల ఆసుపత్రుల్లో కరోనాకు అత్యవసర మందులు తగిన సంఖ్యలో సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. ఈ ఆపత్కాల సమయంలో వైద్య సిబ్బంది సేవలు ప్రశంసనీయమని వారి కృషికి, సేవలకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు.
ప్రతీ ఒక్కరికి శానిటైజర్లు...
పాజిటివ్ కేసులను క్వారంటైన్ కేంద్రాలకు తరలించి పర్యవేక్షించాలని, వీరి కోసం ప్రత్యేక మెడికల్ కిట్లను యాజమాన్యం అందజేస్తోందన్నారు. ఏరియా జీఎంలు ప్రతీరోజూ గనులను తనిఖీ చేయాలని, అక్కడ తీసుకొంటున్న కరోనా నివారణ చర్యలను సమీక్షించాలని సీఎండీ ఆదేశించారు. ప్రతీ కార్మికుడు, అధికారికి 4 మాస్కులు పంపిణీ చేయాలనీ... ప్రతీ ఒక్కరికి శానిటైజర్లు అందించాలన్నారు. ప్రతీరోజూ ఉదయం 7 గంటలకల్లా సింగరేణి వ్యాప్తంగా అప్పటివరకూ తీసుకొన్న చర్యలపై తనకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఎవరైనా తమకు కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే తక్షణమే కంపెనీ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించాలన్నారు.