తెలంగాణ

telangana

ETV Bharat / state

లఘు చిత్రం.. సర్కార్‌ పథకాలకు భలే ప్రచారం - తెలంగాణ ప్రభుత్వ పథకాలపై షార్ట్ ఫిల్మ్

Short Film on Govt Schemes : ఏ ఉత్పత్తికైనా ముఖ్యమైనది ప్రచారం. ఈ అడ్వర్టైజ్‌మెంట్ ఎంత వినూత్నంగా ఉంటే ఆ ఉత్పత్తికి అంత ప్రాధాన్యత లభిస్తుంది. ప్రజల్లో ఆసక్తి నెలకొంటుంది. ఇప్పుడీ ప్రమోషన్స్ ట్రెండ్ ప్రభుత్వ పథకాలకూ పాకింది. సర్కార్‌ ప్రవేశపెట్టే స్కీమ్‌లు ప్రజల్లోకి చేరేలా.. ఈ పథకాలపై వారికి అవగాహన కలిగేలా చాలా రకాల యాడ్స్‌ను ప్రభుత్వం తయారుచేయిస్తోంది. అలా ఓ షార్ట్‌ ఫిల్మ్ ద్వారా సర్కార్ పథకాలపై అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలానికి చెందిన పంచాయతీ కార్యదర్శులు.

Short Film on Govt Schemes
Short Film on Govt Schemes

By

Published : Apr 11, 2022, 9:00 AM IST

Short Film on Govt Schemes : ప్రభుత్వ పథకాలపై లఘుచిత్రాల (షార్ట్‌ఫిల్మ్‌) ద్వారా గ్రామస్థుల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలానికి చెందిన అయిదుగురు పంచాయతీ కార్యదర్శులు. మండలంలోని విజయలక్ష్మీనగర్‌, తిలక్‌నగర్‌, ఒడ్డుగూడెం, సీఎస్‌పీ బస్తీ, చల్లసముద్రం పంచాయతీ కార్యదర్శులు సుస్మిత, తిరుపతి, మల్లేష్‌, లక్ష్మణ్‌, వంశీకృష్ణలు.. ఇప్పటివరకూ నాలుగు చిత్రాలను నిర్మించారు. ఆయా చిత్రాలకు కథ, కథనం అందించడంతో పాటు దర్శకత్వం సైతం వారే నిర్వహించారు. ఆయా గ్రామాల్లోనే వీటిని చిత్రీకరిస్తున్నారు. నటులూ వారే. ఈ లఘుచిత్రాలకు రూ.60 వేల వ్యయం అయిందని, తామే భరించామని తెలిపారు. వీరు రూపొందించిన షార్ట్‌ఫిల్మ్‌లను ఇటీవల జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ తిలకించి అభినందించారు.

ఇవీ చిత్రాలు..పారిశుద్ధ్యం, తడి, పొడి చెత్తని వేరు చేయాల్సిన అవసరంపై 2021 జులైలో షార్ట్‌ఫిల్మ్‌ తీశారు. ప్లాస్టిక్‌ కవర్ల వినియోగం, అనర్ధాలను వివరిస్తూ డిసెంబరులో ‘అంకురం’ లఘుచిత్రం నిర్మించారు. ప్లాస్టిక్‌ కవర్లలోని ఆహార పదార్థాలు తిని పశువులు మరణిస్తున్న తీరును ఇందులో చూపారు. ఈ చిత్రం జాతీయస్థాయి ప్రదర్శనకు ఎంపికైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన పంచాయతీ కార్యదర్శుల శిక్షణ కార్యక్రమంలో దీనిని ప్రదర్శించారు. ఈ రెండు చిత్రాలకు విజయలక్ష్మీనగర్‌ కార్యదర్శి సుస్మిత దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ‘పరివర్తన’ పేరిట తీసిన చిత్రంలో పల్లెల్లో బహిరంగ మలమూత్ర విసర్జన చేయకుండా పరిశుభ్రంగా ఉంచాల్సిన ఆవశ్యకతను వివరించారు. గత అక్టోబరులో తీసిన ఈ చిత్రం జిల్లా అధికారుల ప్రశంసలు అందుకుంది. దీనికి ఒడ్డుగూడెం కార్యదర్శి మల్లేష్‌ దర్శకత్వం వహించారు. జిల్లా ఉద్యానవన అధికారి జినుగు మరియన్న ప్రోత్సాహంతో తాజాగా పామాయిల్‌ సాగుతో లాభాలు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, రైతుల అభిప్రాయాలతో ఓ చిత్రం రూపొందించారు.

ABOUT THE AUTHOR

...view details