YS Sharmila Padayatra at Burgampahad: వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన మహా ప్రస్థానం పాదయాత్ర 68వ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో కొనసాగింది. మోరంపల్లి బంజర గ్రామానికి వచ్చిన షర్మిలకు మహిళలు పూలమాలలు వేసి ఆహ్వానం పలికారు. అనంతరం రైతు గోస దీక్షలో షర్మిల పాల్గొన్నారు.
యాసంగిలో వరి వేయొద్దన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నమ్మి.. 17 లక్షల ఎకరాల్లో రైతులు పంట వేయలేదని షర్మిల ఆరోపించారు. వారందరికీ ఎకరాకు రూ. 25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 8 వేల కొనుగోలు కేంద్రాలని చెప్పి.. 1000 మాత్రమే తెరిచారని.. దిక్కుతోచని రైతులు దళారులకు రూ. 1200కే అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర కల్పించని ముఖ్యమంత్రి, అధికారులెందుకని ప్రశ్నించారు.
వారిని గౌరవిస్తున్నారా.?: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను, ఉద్యమంలో పాల్గొన్న వారిని కేసీఆర్ గౌరవిస్తున్నారా అని షర్మిల మండిపడ్డారు. కుటుంబ బాగుకోసమే తెలంగాణ తెచ్చినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఉద్యమంలో వికలాంగులైన వారిని ఎంత మందిని ఆదుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబం, తెరాస నేతలే బాగుపడ్డారని ధ్వజమెత్తారు.