భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో మరో సంచలనం బయటకొచ్చింది. ఆత్మహత్యకు ముందు నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆత్మహత్య నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులను అందులో వివరించారు. ఆ వీడియోలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవపై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు.
‘‘రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. వనమా రాఘవ దురాగతాలతో ప్రజలు ఎలా బతకాలి. అతని లాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దు. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడిని. కానీ ఏ భర్త కూడా వినగూడని మాట వనమా రాఘవ అడిగారు. నా భార్యను హైదరాబాద్ తీసుకురావాలని అడిగారు. రాజకీయ, ఆర్ధిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారు.
నేను ఒక్కడినే చనిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు. అందుకే నాతో పాటు నా భార్యాపిల్లల్ని తీసుకెళ్తున్నాను. అప్పుల్లో ఉన్న నాపై నా తల్లి, సోదరి కక్ష సాధించారు. నేను వీళ్లందరితో పోరాటం చేసే స్థితిలో లేను. నా తండ్రి ద్వారా వచ్చే ఆస్తితో నా అప్పులు తీర్చాలి. నాకు సహకారం అందించిన అందరికీ న్యాయం చేయాలి.''
- రామకృష్ణ
వనమా రాఘవ తన భార్యను పిల్లలు లేకుండా హైదరాబాద్ తీసుకురమ్మాన్నారని రామకృష్ణ ఆరోపించారు. ఇప్పటికీ తన భార్యకు కూడా ఈ విషయం చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన అక్క సొంతింట్లో ఉంటే.. తాను మాత్రం అద్దె ఇంట్లో ఉండేవాడినని.. వారు ఎప్పుడూ తనకు సహకరించలేదని తెలిపారు. తనకు సహకారం చేసిన అందరికీ న్యాయం జరగాలని రామకృష్ణ ఆకాంక్షించారు.
ఇదీ చూడండి:కుటుంబం ఆత్మహత్య ఉదంతంలో మరో విషాదం.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి