గోదావరిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం ఆనకట్ట నుంచి నీటిని మళ్లించేలా రాష్ట్ర ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ముందు 25 టీఎంసీలు తరలించాలని భావించగా.. అంచనా వ్యయం 7వేల 926 కోట్లుగా ఖరారు చేశారు. ప్రస్తుతం 70 టీఎంసీలు మళ్లించాలని నిర్ణయించగా.. అంచనా వ్యయం 13 వేల కోట్లకు పెరిగింది.
16 ప్యాకేజీలు, 4 పంప్‌హౌస్‌లు...
6లక్షల74 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి. ఎత్తిపోతల్లో భాగంగా 16 ప్యాకేజీలు, 4 పంప్‌హౌజ్‌లు ఏర్పాటుచేస్తున్నారు. 114 కిలోమీటర్ల పొడవు ఉండేలా ప్రధాన కాలువల నిర్మాణాలు చేపడుతున్నారు. ఒక్కో పంప్‌హౌస్‌లో 35 మీటర్ల లోతునుంచి నీటిని లిఫ్ట్ చేసి తరలిస్తారు. మొదటి పంప్‌హౌస్ అశ్వాపురం మండలం భీమునిగుండం కొత్తూరు వద్ద నిర్మిస్తున్నారు. రెండు, మూడో పంప్‌హౌస్‌లు ముల్కలపల్లి మండలం పూసుగూడెం, కమలాపురం వద్ద చేపట్టారు. నాలుగోది దమ్మపేట మండలం గండుగులపాడు వద్ద నిర్మిస్తున్నారు. తొలి పంప్‌హౌస్ దాదాపు పూర్తవగా మిగతా మూడు నిర్మాణంలో ఉన్నాయి.
పనుల్లో వేగం...
సీతారామ ఎత్తిపోతల పథకంతో ఖమ్మం జిల్లాలో 4 లక్షల 59 వేల 8 ఎకరాలకు సాగునీరు అందనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 లక్షల 509 ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో 14 వేల 870 ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. మొత్తం 6లక్షల 74వేల 387 ఎకరాల ఆయకట్టు పచ్చదనం పరచుకునేలా సీతారామపనులు జరుగుతున్నాయి. కొవిడ్ ప్రభావం, వర్షాలు, వరదలతో ఎత్తిపోతల పథకం పనులు గతంలో కాస్త నెమ్మదించాయి. ఇటీవల మళ్లీ వేగం పుంజుకున్నాయి.
మూడు జిల్లాలకు అదనంగా సాగు నీరు...
ఇప్పటికే ప్రతిపాందించిన వాటితోపాటు మరికొంత ఆయకట్టుకు సాగునీరందించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధంచేస్తోంది. ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అదనంగా నీరు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ హైదరాబాద్‌లో భేటీ నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన తెరాస ప్రజాప్రతినిధులు, ఇతర జిల్లాల నేతలు, నీటి పారుదల శాఖ అధికారులతో సమాలోచనలు జరిపారు. లక్షా17 వేల ఎకరాల ఆయకట్టుకు అదనంగా సాగునీరు ఇచ్చేందుకు కొత్తగా ఎత్తిపోతల పథకాలను ప్రతిపాదించారు.
సీఎం ఆమేదం తెలిపటమే తరువాయి...
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 12లక్షల9వేల ఎకరాల సాగు భూమి ఉండగా..భారీ, మధ్యతరహా, చిన్ననీటి వనరుల ద్వారా 10లక్షల47 వేల ఎకరాలు ఆయకట్టు పరిధిలో ఉన్నాయని నీటిపారుదల అధికారులు వెల్లడించారు. ఇల్లెందులో అత్యధికంగా 79 వేలు, వైరా, ఖమ్మం, పినపాక, కొత్తగూడెం నియోజకవర్గాల్లో లక్షా 17 వేల ఎకరాల ఆయకట్టుకు సీతారామ ఎత్తిపోతల పథకంతో సాగునీరు అందించేందుకు అదనపు లిఫ్టులు ప్రతిపాదించారు. సత్తుపల్లి, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో మరో 80 వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రణాళికలపైనా మంత్రులు చర్చించారు. ఎల్టీ బయ్యారం వరకు సీతారామ ఎత్తిపోతల పథకం నీటిని మళ్లించడంపైనా పూర్తిస్థాయి నివేదిక రూపొందించారు. ఈ నివేదికను త్వరలోనే ముఖ్యమంత్రికి అందించనున్నారు. సీఎం ఆమోదం తెలిపితే సీతారామ పథకం ద్వారా అదనంగా మరో లక్షా17 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందనుంది.