Safety Helmet Desgined in Bhadradri Kothagudem :ఇతడో దివ్యాంగుడు.. పైగా ఆర్థిక ఇబ్బందులు. అయినా వీటన్నింటిని దాటి ప్రభుత్వ కొలువు సాధించాడు. అయితే సమాజం కోసం ఉపయోగపడే ఆవిష్కరణలు చేయటం అంటే ఇతడికి మక్కువ ఎక్కువ. అందులో భాగంగానే పలు రకాల ఆవిష్కరణలు రూపొందించి విజయవంతమయ్యాడు. ఇటీవల ప్రత్యేక హెల్మెట్ తయారు చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.
ఆటోవాలా వినూత్న ఆవిష్కరణ.. ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి ఎంపిక
Telangana State Innovation Cell :ఇతడి పేరు ఎస్కే రాజాలి పాషా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సుభాష్‌నగర్‌లోని ఓ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. పుట్టుకతోనే వినికిడి లోపం. పైగా ఓ కాలికి పోలియో కారణంగా అంగవైకల్యం ఏర్పడింది. తన వైకల్యాన్ని తలుచుకుని రాజాలి పాషా ఏనాడూ వెనకడుగు వేయలేదు. బీఏ బీఈడీ, లైబ్రరీ సైన్స్ పూర్తి చేసి.. ఎడ్‌సెట్ దివ్యాంగుల విభాగంలో రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకు సాధించాడు.
దివ్వాంగుల కోటాలో డీఎస్సీ మొదటి ర్యాంకు ఉద్యోగం సాధించి.. స్కూల్ అసిస్టెంటుగా ఉద్యోగం పొందాడు పాషా. ప్రస్తుతం ఖమ్మం గ్రామీణం మండలం గోళ్లపాడు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నాడు. బోధనలో తనదైన ప్రత్యేక ముద్ర కనబరుస్తూ.. ఇతర రంగాల్లో విద్యార్థులు రాణించేలా కృషి చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం పాషా ఆత్మీయ మిత్రుడు ఒకరు భద్రాచలం బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు.
Bhadradri Kothagudem News :వెనుక నుంచి వచ్చిన పెద్ద వాహనం హారన్ శబ్దం వినిపించకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని గ్రహించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు తాను.. ఓ సారి వెనుక నుంచి వచ్చే వాహన సైరన్‌ను గమనించకపోవడంతో ప్రమాదానికి గురయ్యాడు. ప్రతి నిత్యం వాహనాలు నడిపే దివ్యాంగులు, ముఖ్యంగా వినికిడి లోపం ఉన్న వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో గ్రహించాడు పాషా. ఇందుకు సరైన పరిష్కార మార్గం కనుగొనాలని సంకల్పించాడు.
అలా పలు విధాలుగా ప్రయత్నించి చివరకు ప్రత్యేక సాంకేతికత సాయంతో.. వినికిడి లోపం ఉన్న వారి కోసం ప్రత్యేకంగా హెల్మెట్ రూపొందించాడు. వెనుక నుంచి వచ్చే వాహనాలు హారన్ శబ్దం చేసినప్పుడు వినికిడిలోపం ఉన్న వాహనదారులకు సులభంగా గ్రహించేలా శిరస్త్రాణం రూపొందించాడు. ఈ హెల్మెట్‌లో రెండు మదర్ బోర్డులు, మరో రెండు బ్యాటరీలు, రిసీవర్, చిన్న బల్బులు అమర్చాడు.