RTC Officials Cancelled Cargo Agency in Illandu : దూర ప్రాంతంలో ఉన్న తమ బంధువులకు జామకాయలు పంపించాలని అనుకున్న ఓ వ్యక్తి.. కార్గో ఏజెన్సీ సిబ్బంది చేసిన నిర్వాకానికి ఆశ్చర్యపోయాడు. దీనికి కారణం.. అతను పంపిన జామపండ్ల పార్సిల్లో వారు కొన్నింటిని మాయం చేశారు. ఈ ఘటన ఈ నెల 18న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో జరిగింది. దీనిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, హైదరాబాద్‌లలో ఈనాడు దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. వీటికి స్పందించిన అధికారులు.. సదరు కార్గో ఏజెన్సీని రద్దు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం కొమరారం గ్రామానికి చెందిన మచ్చ రమేశ్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో ఉన్న తమ బంధువులకు జామకాయలు పంపించాలని అనుకున్నాడు. తన కుమారుడైన మురళీకి వాటిని ఇచ్చి ఈ నెల 18న ఇల్లందు ఆర్టీసీ బస్టాండ్‌కు పంపించాడు. వాటిని కార్గో సిబ్బంది తూకం వేయగా.. 51 కిలోలు ఉన్నాయని తేలింది. దీనికి వారు రూ.443 తీసుకున్నారు. అయితే 19వ తేదీన రావాల్సిన పార్సిల్.. ఒక రోజు ఆలస్యంగా హైదరాబాద్‌కు వచ్చింది.
ఆ పార్సిల్‌ను తీసుకోవడానికి రమేశ్ బంధువు శ్రీహరి ఉప్పల్‌లోని అడ్డరోడ్డు వద్దకు వెళ్లాడు. తీసుకున్న తర్వాత వాటిని తూకం వేయగా.. 51 కిలోలకు బదులు 27 కిలోలుగా బరువు చూపించింది. దీంతో అవాక్కైన శ్రీహరి.. వెంటనే రమేశ్‌కు ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నాడు. తాను 51 కేజీల పండ్లు పంపించానని అతను చెప్పాడు. దీంతో శ్రీహరి.. 51 కిలోలు ఉండాల్సిన పార్సిల్.. 27 కిలోలు ఎందుకు ఉందని కార్గో అధికారుల్ని ప్రశ్నించాడు. తమకేం తెలియదని, పార్సిల్ చేసిన చోటే కనుక్కోవాలని వారి నుంచి సమాధానం వచ్చింది.
దీంతో ఇల్లందులోని కార్గో సిబ్బందిని అడిగితే.. తాము సరిగానే తూచి బిల్లు ఇచ్చామని, అక్కడే అడగాలని తెలిపారు. దీంతో వారు చేసేదేం లేక కార్గో సర్వీసుకు ఫోన్ చేశారు. వారు దీనిపై తమకు కూడా ఫిర్యాదు అందిందని, విచారించాలని చెప్పారు. ఈ ఘటనపై అక్కడ ఇల్లందులో " కార్గోలో జామకాయలు మాయం..!" అన్న శీర్షికన ఈ నెల 21న, ఇక్కడ హైదరాబాద్‌లో "తూచింది 51 కేజీలు.. వచ్చింది 27 కేజీలు" అన్న శీర్షికన 22న కథనాలు ప్రచురితమయ్యాయి. వీటికి స్పందించిన అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు.
జామకాయలు బుక్ చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బస్సు స్టేషన్ కార్గో కార్యాలయాన్ని ఆర్టీసీ వరంగల్ ఖమ్మం రీజియన్ ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్ గోపాల్ శుక్రవారం సందర్శించారు. తగిన విచారణ చేసిన ఆయన.. పార్సిల్ నమోదు తేడాలో పొరపాటు జరిగిందని గుర్తించారు. వెంటనే ఆ ఏజెన్సీని రద్దు చేసి ఆర్టీసీ ద్వారా ప్రస్తుతం కార్గో సర్వీసును నిర్వహిస్తామని వెల్లడించారు.