Revanth Reddy speech in Hath Se Hath Jodo Yatra : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలో రెండోరోజు రేవంత్ పాదయాత్ర జోరుగా సాగింది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీనాయకులు, వివిధ ప్రజాసంఘాలు, కార్మికసంఘాలతో రేవంత్ సమావేశమయ్యారు. రాజీవ్‌నగర్ తండా వాసులతో సమావేశమై... వారి సమస్యలపై చర్చించారు. సాయంత్రం రాజీవ్‌నగర్ నుంచి ఇల్లెందులోని జగదాంబ సెంటర్ వరకు 5 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేశారు.
అనంతరం అక్కడే నిర్వహించిన సభలో పాల్గొన్న రేవంత్... భారాస సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో... దళిత, బీసీ, గిరిజన వర్గాలకు ఏమాత్రం న్యాయం జరగలేదని మండిపడ్డారు. ప్రభుత్వం దిగే సమయంలో పోడుభూములకు పట్టాలు పంపిణీ చేస్తామని.. మోసపూరిత మాటలు చెబుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఇల్లెందు గడ్డ కాంగ్రెస్ అడ్డా అన్న రేవంత్ రెడ్డి.. అధికారాన్ని అడ్డంపెట్టుకొని స్థానిక ఎమ్మెల్యే భర్త హరి దందాలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. సింగరేణిలో దందా, ఇసుక, ఇటుక వ్యాపారంలో దందాలు చేస్తున్నారన్నారు. వరంగల్ డిక్లరేషన్ మేరకు రైతులకురుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇల్లెందు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర ముగిసింది. శనివారం రాత్రి అశ్వాపురం చేరుకొని అక్కడే బసచేశారు. నేడు విరామం ఇవ్వనున్న రేవంత్... రేపటి నుంచి పినపాక నియోజకవర్గంలో యాత్ర చేపట్టనున్నారు. ఈనెల 14 నుంచి 21 వరకు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో హాథ్ సే హాథ్ జోడో యాత్ర సాగుతుందని పార్టీ నేతలు వెల్లడించారు. స్థానిక నేతలంతా సమావేశమై యాత్ర షెడ్యూల్‌ను ఖరారు చేశారు.
Revanth Reddy with Singareni workers: అంతకు ముందు సింగరేణి ఉపరితల గని ఆవరణలో కార్మికులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘాల నాయకులతో రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. కాంట్రాక్టు కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. తమ శ్రమ దోపిడీకి గురవుతోందని.. సమాన పనికి సమాన వేతనం అమలు కావడంలేదని వారు విచారణ వ్యక్తం చేశారు. సమస్యలు విన్న రేవంత్.. రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులు సమస్యలు పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు.