Record Price for Cotton in Telangana : తెలంగాణలో దూది పూల సోయగం ధరల ధగధగతో మెరుస్తోంది. ఒకప్పుడు మద్దతు ధర ఆశలే గగనమైన చోట ఈసారి రైతుకు సంపత్తినిచ్చిన పంటగా పత్తి ఖ్యాతినందుకుంటోంది. కొత్త ఏడాది ప్రారంభం నుంచి మార్కెట్లలోకి వస్తున్న తెల్లబంగారానికి వ్యాపారులు దండిగానే ధరను నిర్ణయిస్తున్నారు. ఈ నెల 5న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు సబ్ మార్కెట్‌యార్డులో రికార్డు స్థాయిలో క్వింటా పత్తిని రూ.10,200కు రైతులు అమ్ముకున్నారు. అదేరోజున ఖమ్మం మార్కెట్లో రూ.10 వేలు, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రూ.9,800, మహబూబ్‌నగర్ జిల్లా బాదెపల్లిలో రూ.9,899 గరిష్ఠ ధర పలికింది. మరుసటి రోజున కేసముద్రం మార్కెట్‌లోనూ క్వింటా పత్తిని రూ.10,101కు రైతులు విక్రయించారు. పక్షం రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్కెట్లలో 15 నుంచి 20చోట్ల రూ.9వేలకు పైగా ధర రైతుకు దక్కుతుండటం గమనార్హం.
మద్దతు ధరకు అదనంగా 70%..
Cotton Price Record in Telangana 2022 : పత్తికి ఈ సీజన్‌లో వచ్చిన ధర ఎప్పుడూ రాలేదని మార్కెటింగ్‌శాఖ అధికారులతోపాటు రైతులు ఆనందంగా చెబుతున్నారు. గతంలో ఎక్కువలో ఎక్కువగా రూ.7-8 వేల ధర అదను దాటిన తరువాత అమ్మిన వాళ్లకు లభించేది. చాలా చోట్ల భారత పత్తి సంస్థ(సీసీఐ) ఈసారి కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో వ్యాపారులు అవసరాన్ని బట్టి తెల్లబంగారానికి మంచి ఖరీదు కడుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.6,025కు దాదాపుగా 70 శాతం అదనంగా పలుకుతోంది. డిసెంబరు 1 నుంచి ఈ నెల 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,03,585.32 టన్నుల పత్తిని మార్కెటింగ్‌శాఖ పర్యవేక్షణలో కొనుగోలు చేశారు.