Bhadrachalam Sri Rama Navami Kalyanam Tickets: భద్రాచలం రాముల వారి ఆలయంలో ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 5 వరకు శ్రీరామ నవమి కల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ నెల 30న ఆలయ సమీపంలోని మిథిలా మండపంలో నిర్వహించే కల్యాణాన్ని భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన టికెట్లను ఈరోజు నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు ఆలయ ఈవో రమాదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆన్‌లైన్‌లో టికెట్లు : www.bhadrachalamonline.com వెబ్‌సైట్‌లో రూ.7,500, రూ.2,500, రూ.2 వేలు, రూ.1000, రూ.300, రూ.150 టికెట్లు లభిస్తాయని అన్నారు. రూ.7,500 టికెట్‌పై ఇద్దరికి ప్రవేశం కల్పిస్తామని దాంతో పాటు స్వామివారి ప్రసాదం అందజేస్తారని పేర్కొన్నారు. మిగతా వాటిపై ఒక టికెట్‌పై ఒకరికే అవకాశం కల్పిస్తారు. మొత్తంగా 16,860 మంది టికెట్లతో మండపంలోను, 15 వేల మంది స్టేడియం నుంచి ఉచితంగా కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు అని తెలిపారు.
ఎప్పటి నుంచి టికెట్లు ఆన్‌లైన్‌లో ఉంటాయి?:రూ.7,500 టికెట్లను ఆన్‌లైన్‌తో పాటు ఆలయ కార్యాలయంలోనూ ఈరోజు నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ నెల 31న నిర్వహించే శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకానికి సంబంధించి ఈసారి 3రకాల ధరలతో టికెట్లను విక్రయించనున్నారు. వీటినీ ఈరోజు నుంచి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.