తెలంగాణ

telangana

ETV Bharat / state

సిగ్గుతో సీతమ్మ.. చిరునవ్వుతో రామయ్య.. - సీతారాముల కల్యామం కమనీయం

శివ ధనుస్సు విరిగింది..లోక కల్యాణానికి బీజం పడింది. సంబర తుంబుర నాదాల నడుమ జానకిరాముల కల్యాణం..భద్రాచలంలో జరిగే అతిపెద్ద సంబురం. ప్రతీఏటా శ్రీరామనవమి రోజు సీతారాముల పరిణయం జగద్విఖ్యాతం. అజరామరం.

సిగ్గుతో సీతమ్మ.. చిరునవ్వుతో రామయ్య..

By

Published : Apr 14, 2019, 6:35 AM IST

Updated : Apr 14, 2019, 8:37 AM IST

సిగ్గుతో సీతమ్మ.. చిరునవ్వుతో రామయ్య..

అనగఅనగ రమణీయం..కనగకనగ కమనీయం..
వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి రోజున కర్కాటక రాశిలో అభిజిత్‌ లగ్నంలో జరిగే సీతారాముల పరిణయం.. లోక కల్యాణం . అనగఅనగ రమణీయం..కనగకనగ కమనీయం జానకీరాముల కల్యాణం. అందుకే జన్మలో ఒక్కసారైనా రాములోరి పరిణయాన్ని చూసి తరించాలంటారు.

సిగ్గుతో సీతమ్మ..చిరునవ్వుతో రామయ్య
నుదుటున మణిబాసికంతో... పారాణితో సిగ్గులొలికే సీతమ్మ. కస్తూరి నామంతో... దివ్యతేజస్సుతో వెలిగే నీలిమేఘ శ్యాముడు రామయ్య. వీరిద్దరూ వధూవరులుగా... పెళ్లిపీటలపై ఆశీనులైన వేళ... అంబరాన్ని తాకే శ్రీరామనామ సంకీర్తన. భద్రగిరి మిథిలా స్టేడియం ఎగిసిపడే ఉత్తుంగ భక్తి తరంగం. జానకీ పరిణయంలో ప్రతీ క్రతువు అద్భుతం...అమోఘం. చూసే ప్రతీ తనువు పులకించాల్సిందే.

మూడు గంటలపాటు సుమనోహరం
మూడు గంటలపాటు సాగే కల్యాణోత్సవం... ఆద్యంతం సుమనోహరం. ఎదురుకోళ్ళు, కన్యాదానం, మాంగళ్యధారణ, తలంబ్రాలు... ఇలా అన్ని ఘట్టాల్లోనూ సీతారాముల్ని కీర్తిస్తూ... వారిని స్తుతిస్తూ సాగే... కీర్తనలు... ఆలాపనలు.. భక్తులను ఎంతగానో కట్టిపడేస్తాయి. ముఖ్యంగా ముత్యాల తలంబ్రాల తంతు.. మహీజ వివాహంలో అంత్యత రమణీయమైన ఘట్టం.

జానకి దోసిట తలంబ్రాలు
శ్రీరామ పరిణయ ఘట్టంలో జానకి దోసిట తలంబ్రాలు కెంపుల ప్రోవై కనిపిస్తుంటాయట. రాముని దోసెట నీలపురాశిలా మెరుస్తాయట. ఆణిముత్యపు తలంబ్రాలు ఇద్దరి శిరస్సున సూర్యునిలా వెలుగులు జిమ్ముతాయట. కుంకుమ కలిపిన బియ్యం, మురిపాల ముత్యాలతో కలసి జాలువారుతుంటే... కనురెప్ప వేయగలమా. ముత్యాల సవ్వడిని ఆస్వాదించకుండా ఉండగలమా ?

Last Updated : Apr 14, 2019, 8:37 AM IST

ABOUT THE AUTHOR

...view details