సింగరేణి సంస్థ(Singareni Collieries Company) తమ ఉద్యోగులు, కార్మికుల పదవీవిరమణ(retirement) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పదవీవిరమణ వయసు 61 ఏళ్ల పెంపునకు సోమవారం జరిగిన 557వ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశం ఆమోదం తెలిపింది. సీఎండీ(CMD) శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ బోర్డు సమావేశంలో సింగరేణి(SCCL) డైరెక్టర్లతో పాటు కేంద్ర, రాష్ట్రాల నుంచి బోర్డు ప్రతినిధులు పాల్గొన్నారు.
సీఎం ఆదేశాలతో..
ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరి పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జులై 20న సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచాలని సీఎం ఆదేశించారు. సీఎం కేసీఆర్(CM KCR) ఆదేశాలతో పదవీ విరమణ వయసు పెంచినట్లు సింగరేణి సీఎండీ శ్రీధర్ తెలిపారు. మార్చి 31 నుంచి అమలు చేయనున్నట్లు వివరించారు. ఈ నిర్ణయం వల్ల 43,899 మంది అధికారులు, కార్మికులకు లబ్ధి చేకూరుతుందన్నారు.
మళ్లీ ఉద్యోగం
మార్చి 31 నుంచి జూన్ 30 మధ్యలో పదవీవిరమణ చేసిన 39 మంది అధికారులు, 689 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోనున్నట్లు సీఎండీ వెల్లడించారు. దీనిపై సమగ్రమైన విధివిధానాలు రూపొందించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ఈ వయో పరిమితి పెంపును సింగరేణి విద్యా సంస్థల్లోనూ అమలు చేస్తామన్నారు.
వివిధ అంశాలకు ఆమోదం
పదవీ విరమణతో పాటు పలు అంశాలకు బోర్డ్ ఆమోదం తెలిపింది. కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియలో ఇప్పటి వరకు కేవలం కుమారులకు, అవివాహిత కుమార్తెలకు మాత్రమే అవకాశం కల్పిస్తుండగా... కార్మికుల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు విశ్రాంత ఉద్యోగిపై ఆధారపడి ఉన్న పెళ్లయిన, విడాకులు పొందిన కుమార్తెలకు కూడా కారుణ్య నియామకాల్లో అవకాశాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. సమీప గ్రామాల అభివృద్ధికి ఉద్దేశించిన సామాజిక బాధ్యతా కార్యక్రమాల (CSR) నిర్వహణకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.60 కోట్లు వెచ్చించడానికి బోర్డు ఆమోదం తెలిపిందన్నారు. అలాగే వివిధ గనులకు అవసరమైన యంత్రాలు, కాంట్రాక్టు పనులు తదితర అంశాలకు ఆమోదం లభించిందని పేర్కొన్నారు.
'రామగుండంలో కొత్తగా ప్రారంభించనున్న ఆర్జీ ఓసీ-5కు సంబంధించి రెండు కొత్త రోడ్ల నిర్మాణానికి అవసరమయ్యే బడ్జెట్‌కు బోర్డు ఆమోదం తెలిపింది. ఫస్ట్ క్లాస్ మైన్ మేనేజర్ సర్టిఫికెట్ ఉన్న మైనింగ్ అధికారుల హోదా మార్పుపై బోర్డు ఆమోదం తెలిపింది. ఎగ్జిక్యూటివ్, ఎన్.సి.డబ్ల్యు.ఎ. ఉద్యోగ నియామకాల్లో గతంలో ఉద్యోగ నిబంధనల ప్రకారం కొన్ని లింగపరమైన ఆంక్షలు ఉండేవి. ఇప్పుడు అన్ని పోస్టులకు లింగ భేదాన్ని తొలగిస్తూ ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవడానికి బోర్డు అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు శ్రీరాంపూర్ ఏరియా నస్పూర్ కాలనీ వద్ద జాతీయ రహదారి విస్తరణలో నిర్వాసితులైన స్థానికులకు సింగరేణి నిర్వాసిత కాలనీలో 85 చదరపు గజాల విస్తీర్ణం గల 201 ప్లాట్లను కేటాయించడానికి కూడా బోర్డు ఆమోదించింది.'
-శ్రీధర్, సింగరేణి సీఎండీ
ఇదీ చదవండి:CM KCR: 'ఆర్థికంగా పటిష్ఠమైన రోజే ఎస్సీలు వివక్ష నుంచి దూరం అవుతారు'