నడిచేందుకే సరైన దారి లేని ఆ అరణ్యానికి అంబులెన్సులు మైలు దూరంలోనే నిలిచిపోయాయి. గుండెను సైతం మార్చేంతగా... అభివృద్ధి చెందిన వైద్యం ఆ తల్లికి పురుడు పోసేందుకు కిలోమీటర్ల ఆవలే ఆగిపోయాయి. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన మహిళల ప్రసవ వేదనకు మరోసారి సాక్ష్యంగా నిలిచింది పచ్చని అడవి.
5 కిలోమీటర్లు మోసుకెళ్లారు.. కానీ అడవిలోనే ప్రసవం - agency people problems
ఆ తల్లి పురిటి నొప్పుల బాధను... చూసి అడవి నిశ్శబ్దంగా రోధించింది. ఇంత అభివృద్ధి చెందుతున్న సమాజానికి మహిళ పెడుతున్న అరుపులు వినిపించట్లేదా అని హీనంగా వెక్కిరించింది. ఆ అతివ పడుతున్న యాతన చూడలేక... తన పచ్చని ఒడిలోనే పండంటి బిడ్డకు ప్రసవం పోసింది. ఇదేదో... బీసీ కాలపు నాటి కథ కాదండీ... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజన్సీ ప్రాంతంలో నేడు జరిగిన వాస్తవ ఘటన.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని కీకారణ్యంలో ప్రసవ వేదన పడ్డ ఓ నిండు గర్భిణీ... పచ్చటి అడవిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మారుమూల గ్రామం ఎర్రంపాడుకు చెందిన గర్భిణీ కొవ్వాసి ఐతేకు నెలలు నిండుకున్నాయి. ఒక్కసారిగా పురిటినొప్పులు రాగా... ప్రసవం కోసం మహిళను ఆ కుటింబీకులు జడ్డీలో ఆసుపత్రికి తీసుకుని బయలుదేరారు. ఆశ కార్యకర్త సాయంతో గర్భిణీని తన భర్త చర్లకు తీసుకెళ్లేందుకు బయలుదేరాడు. నడిచేందుకు కనీసం దారి కూడా లేని పరిస్థితిలో... దేవుడి పైనే భారం వేసి నడక సాగించారు.
కాలినడకన దాదాపు 5 కిలోమీటర్లు నడిచిన తర్వాత పురిటినొప్పులు మరింత తీవ్రమై... కీకారణ్యంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ తల్లి. ప్రసవం తర్వాత సైతం అంబులెన్సు వరకు నడక సాగించారు. బాలింతను అంబులెన్సు సాయంతో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని తెలుపగా... కుటుంబీకులు సంతోషం వ్యక్తం చేశారు.