Ponguleti Latest News: గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేయాలని ఎంతోమంది కోరినా తాను నిరాకరించానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ చెప్పిన మాటలతో పార్టీ నియమాలకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. అనేక కారణాలు చూపుతూ తన ఎంపీ స్థానానికి కూడా పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా మరో పార్టీకి చెందిన వ్యక్తిని పోటీలో నిలిపారని గుర్తు చేసిన ఆయన.. నాలుగేళ్లుగా తనను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేకపోయానని వాపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ మేరకు ఆయన మాట్లాడారు.
నాలుగేళ్లుగా తనకు ఏ పదవీ ఇవ్వకపోయినా ఆత్మగౌరవంతో ఉంటూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నానని పొంగులేటి పేర్కొన్నారు. కష్టాలను ఎదుర్కొంటూ తనతో పాటు ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఇల్లందు ఆత్మీయ సమ్మేళనానికి రాకుండా అభిమానులకు అనేక అడ్డంకులు సృష్టించారని ఆరోపించిన ఆయన.. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ఏ అధికారి కానీ, ప్రజా ప్రతినిధి కానీ అభిమానులను ఇబ్బందులు పెడితే శీనన్న ప్రత్యక్షమవుతాడని హెచ్చరించారు. పొద్దు ముగిసిన తర్వాత ఏ గూటి పక్షి ఆ గూటికి వస్తుందన్నది వాస్తవమని.. ఎలాంటి అడ్డంకులు దీని ముందు చెల్లవని వ్యాఖ్యానించారు.
గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేయమని ఎంతో మంది కోరినా ముఖ్యమంత్రి చెప్పిన మాటలతో పార్టీ నియమాలకు కట్టుబడి ఉన్నాను. నాలుగేళ్లుగా నన్ను నమ్ముకున్న ఏ ఒక్కరికీ ఏమీ చేయలేదు. ఏమీ ఇవ్వకపోయినా ఆత్మగౌరవంతో ఉంటూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నాను. కష్టాలను ఎదుర్కొంటూ నాతో పాటు ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరిని మరో రెండు, మూడు నెలలు ఇబ్బందులు పెడతారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ఏ అధికారి కానీ, ప్రజా ప్రతినిధి కానీ అభిమానులను ఇబ్బందులు పెడితే శీనన్న ప్రత్యక్షమవుతాడు. - పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ