Kothagudem bandh: రేపు కొత్తగూడెం బంద్‌కు రాజకీయ పార్టీలు, వామపక్ష, విపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితులను శిక్షించాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలని.. వనమా రాఘవను అరెస్టు చేసి రౌడీషీట్ తెరవాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా బంద్ చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఏం జరిగిందంటే..
భద్రాద్రి కొత్తగూడెంలోని తూర్పుబజార్‌లో నివాసముంటున్న రామకృష్ణ... పాల్వంచలో మీ సేవా కేంద్రాన్ని నడిపారు. ఇటీవల ఇతరులకు లీజుకు ఇచ్చారు. అనంతరం రాజమహేంద్రవరానికి వెళ్లి రెండ్రోజుల క్రితం తిరిగి వచ్చారు. అనంతరం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దహనం కాగా.. చిన్న కుమార్తె తీవ్రగాయాలతో బయటపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆ చిన్నారి కన్నుమూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రామకృష్ణ కారులో పలు పత్రాలు, బిల్లులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ దొరకడంతో ఆత్మహత్యగా నిర్ధారించారు.
సూసైడ్ నోట్‌లో ఏముందంటే..
సూసైడ్ నోట్‌లో ఎమ్మెల్యే వనమా కుమారుడు రాఘవేందర్ పేరు ఉంది. అతనితో పాటు రామకృష్ణ తల్లి సూర్యవతి, అక్క మాధవి పేర్లు కూడా ఉన్నాయి. వనమా రాఘవేందర్‌కు రామకృష్ణ అక్క మాధవికి వివాహేతర సంబంధం ఉందని... వారివల్ల తనకు అన్యాయం జరుగుతోందని అందుకే... ఆత్మహత్య చేసుకున్నట్లు రామకృష్ణ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.