Police stopped Congress leaders: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం బొజిగుప్ప వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దుమ్ముగూడెం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న కాంగ్రెస్ నేతల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అదుపు చేసే క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఈ సందర్భంగా భద్రతా కారణాల రీత్యా అనుమతి ఇవ్వడం లేదనే పోలీసుల సమాధానంపై నేతలు తీవ్రంగా మండిపడ్డారు. దుమ్ముగూడెం ఎందుకు వెళ్లనివ్వరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు వద్ద జరుగుతున్న రహస్యం ఏంటని నిలదీశారు. ప్రాజెక్టు లోపాలు బయటపడతాయన్న భయంతోనే పోలీసులతో తమను అక్కడికి వెళ్లనీయకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. పోలీసుల తీరుకు నిరసనగా దుమ్ముగూడెం వెళ్లే దారిలో ధర్నా నిర్వహించారు.