పాల్వంచలో వ్యాపారి రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవేంద్రకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2001లో నమోదైన ఓ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని పాల్వంచలోని అతని ఇంటికి నోటీసులు అంటించారు. మధ్యాహ్నం 12.30 గంటలలోగా మణుగూరు ఏఎస్పీ శబరీశ్ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.
ఆ వ్యాపారి ఆత్మహత్యలోనూ కీలకపాత్రధారి..
2001లో ఫైనాన్స్ వ్యాపారి మల్లిపెద్ది వెంకటేశ్వరరావు(40) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన సూసైడ్ నోట్లో.. వనమా రాఘవ సహా 42 మంది పేర్లను పేర్కొన్నారు. వెెంకటేశ్వరరావు కేసులో వనమా రాఘవ అప్పుడు.. ముందస్తు బెయిల్ పొందాడు. ఇదే కేసులో ఇవాళ మధ్యాహ్నం మణుగూరు ఏఎస్పీ ఎదుట విచారణకు హాజరు కావాలని రాఘవ ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. హాజరు కాని యెడల ముందస్తు బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
వనమా రాఘవపై ఆరోపణలు..
వనమా రాఘవేంద్రరావుపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కొన్ని ఘటనల్లో కేసులు కూడా నమోదయ్యాయని చెప్పారు. వాటిలో ఓ వ్యాపారి ఆత్మహత్య కేసులోనే నేడు విచారణ చేయనున్నట్లు వెల్లడించారు. పాల్వంచ గ్రామీణం, పట్టణ పోలీస్ స్టేషన్‌లలో ఇప్పటి వరకు మొత్తం ఆరు కేసులు నమోదనట్లు వివరించారు.
అక్కడ రెండు కేసులు..
2013లో ప్రభుత్వ ఉద్యోగి ఉత్తర్వులు ఉల్లంఘించి, ఎన్నికల్లో డబ్బులు ఎర వేశారని.. అదే ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, విధులకు ఆటంకం కలిగించి దౌర్జన్యం చేశారంటూ.. పాల్వంచ గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.
ఇక్కడ నాలుగు కేసులు..
2006లో ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి అల్లరి మూకలతో కలిసి హంగామా చేశాడన్న ఆరోపణలపై వనమా రాఘవ కేసును ఎదుర్కొన్నాడు. 2017లో ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసి ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించాడని.. 2020లో ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించి, కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి.
ఇవీ చదవండి :