Bhadradri Temple Employees Protest: భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆలయ ప్రాంగణంలోని ప్రసాదాల తయారీ సీజ్ చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాన్ని దేవస్థానం ఉద్యోగులు అడ్డుకున్నారు. వీరికి టీఎన్జీవోలు మద్దతు పలకడంతో సాయంత్రం 4 గంటల నుంచి 6గంటల వరకు ధర్నా చేశారు. ఆ సమయంలో అన్ని లడ్డూ కౌంటర్లను మూసేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రసాదం విభాగాన్ని ఎలా సీజ్ చేస్తారంటూ రామాలయ ఉద్యోగులు ప్రశ్నించారు. భద్రాచలం జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తాము సీజ్ చేసేందుకు వచ్చామని సీఐ నాగరాజురెడ్డి బదులిచ్చారు. ఈ ఘటనపై సుమోటోగా కేసు కూడా నమోదైందని ఆయన తెలిపారు. అయినప్పటికీ ఈవోకు గాని, సంబంధిత అధికారులకు నోటీసులు ఇచ్చిన తర్వాతే తయారీ కేంద్రం వద్ద తనిఖీలు చేయాలని ఆలయ సిబ్బంది వాగ్వాదానికి దిగారు.
లడ్డూలు పాడవలేదని నినాదాలు చేస్తూ.. ధర్నాకు దిగారు. అప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్ సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో ఆర్డీవో రత్న కల్యాణి పోలీసులు, రామాలయ ఉద్యోగులతో మాట్లాడి సర్ది చెప్పారు. ప్రస్తుతానికి కొన్ని లడ్డూలను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు తీసుకెళ్లి పరీక్షించాలని ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ను ఆర్డీవో ఆదేశించారు. ఆ ఫలితాలు వచ్చాక చర్యలు ఉంటాయని ఆర్డీవో తెలపడంతో పోలీసులు తిరిగివెళ్లారు. ఆలయ ఉద్యోగులు ధర్నా విరమించారు.