తెలంగాణ

telangana

ETV Bharat / state

Paddy procurement in khammam: నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు.. రైతులకు తప్పని నిరీక్షణ - ఉమ్మడి ఖమ్మం

Paddy procurement in khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. నెలరోజుల క్రితమే కేంద్రాలు ప్రారంభించినా.. పంట విక్రయించేందుకు పడిగాపులు తప్పడం లేదు. మిల్లర్లు కొర్రీలు విధిస్తుండటం, సకాలంలో రవాణా జరగక కేంద్రాల వద్ద రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. రోజుకో తీరుగా మారుతున్న వాతావరణ పరిస్థితులు రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.

Paddy procurement in khammam
నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు

By

Published : May 11, 2022, 5:05 AM IST

Updated : May 11, 2022, 5:40 AM IST

Paddy procurement in khammam: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ధాన్యం రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉభయ జిల్లాల్లో ఏప్రిల్ 14న ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచారు. ఖమ్మం జిల్లాలో 216 కేంద్రాలు తెరవగా..111 కేంద్రాలో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో ధాన్యం సేకరణ లక్ష్యం 2 లక్షల మెట్రిక్ టన్నులు కాగా.. ఇప్పటికే సగం ధాన్యాన్ని రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించారు. సుమారు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి సేకరిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ నెల రోజులు దాటుతున్నా ఇప్పటివరకు 26 వేల 328 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. లక్ష్యంలో కనీసం మూడో వంతు సైతం కొనలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 158 కేంద్రాలు ప్రారంభించగా.. 48 కేంద్రాల్లోనే కొనుగోళ్లు సాగుతున్నాయి. ఈసారి ధాన్యం సేకరణ లక్ష్యం 50 వేల మెట్రిక్ టన్నులు కాగా.. ఇప్పటివరకు కేవలం 5వేల 336 మెట్రిక్ టన్నులే సేకరించారు.

నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు.. రైతులకు తప్పని నిరీక్షణ

కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు నెలకొన్నాయి. గోని సంచుల కొరత వేధిస్తుంది. రవాణా ఇబ్బందులు రైతులను నిరీక్షించి నీరసించేలా చేస్తున్నాయి. ధాన్యాన్ని కాంటా వేసినా సకాలంలో లారీలు రాక పడిగాపులు పడుతున్నారు. హమాలీలు సరిపడా లేక ఇబ్బందులు పడుతున్నారు. వెయ్యిపది రకానికి చెందిన వడ్లు తీసుకునేందుకు మిల్లర్లు తిరస్కరిస్తున్నారు. ఈ పరిస్థితి కొనుగోళ్లు సక్రమంగా సాగకపోవడానికి కారణమవుతోంది. తరుగు తక్కువ తీయాలని కోరుతున్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని వేడుకుంటున్నారు.

అధికారులు మాత్రం జిల్లాల్లో కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఇప్పటికే అకాల వర్షంతో కేంద్రాల్లో ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడ్డారు. మళ్లీ గాలి దుమారం, వర్షాలు కురిసేలా వాతావరణం మారుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. త్వరితగతిన ధాన్యం కొనుగోళ్లు జరపాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి: హైదరాబాద్​లో ఉగ్రవాదుల రెక్కీ... ఆ​ రైల్వే స్టేషన్​లో బాంబులు!

సమస్య పరిష్కరిస్తానంటూ మహిళపై పోలీస్ అత్యాచారం

Last Updated : May 11, 2022, 5:40 AM IST

ABOUT THE AUTHOR

...view details