తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉగ్ర గోదావరి.. కొనసాగుతోన్న మూడో ప్రమాద హెచ్చరిక - భద్రాచలం తాజా వార్తలు

గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వరద ఉద్ధృతితో ఏడేళ్ల తర్వాత భద్రాచలం వద్ద నీటి మట్టం 61 అడుగులు దాటింది. మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు సహాయక చర్యలపై దృష్టిపెట్టారు. ఎడతెరిపిలేని వానతో ఏజెన్సీ గ్రామాలు వరద ముంపులో చిక్కుకోగా.. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Ongoing third danger warning at godavari
ఉగ్ర గోదావరి.. కొనసాగుతోన్న మూడో ప్రమాద హెచ్చరిక

By

Published : Aug 17, 2020, 11:00 PM IST

భద్రాచలం వద్ద గోదావరి మూడో ప్రమాద హెచ్చరిక దాటి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వరద చేరడంతో.. రాత్రి 10 గంటల వరకు నీటి మట్టం 60.9 అడుగులకు చేరుకుంది. 2013 తర్వాత తొలిసారి అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

వరద ప్రవాహంతో కల్యాణకట్ట, స్నానఘట్టాలు, ప్రధాన రహదారులు, కొత్తకాలనీ, రామాలయం సెంటర్లు, ఇష్టాకాంప్లెక్స్ నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను.. అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఖమ్మం నుంచి భద్రాచలానికి రాకపోకలను అధికారులు నియంత్రిస్తున్నారు. భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులను.. ఆర్టీసీ రద్దు చేసింది. ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచాయి. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంతాలకు ముంపు తీవ్రత కొనసాగుతోంది. చర్ల, దుమ్ముగూడెం మండల్లాల్లో ముంపు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

ఏడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు..

భద్రాచలం వద్ద గోదావరి చరిత్రలో 2 సార్లు 70 అడుగులు దాటింది. మరో 4సార్లు 1976, 1983, 2006, 2013లో నీటి మట్టం 60 అడుగులు దాటింది. 1986 ఆగస్టు 16న అత్యధికంగా గోదావరి నీటిమట్టం 75.65 అడుగులు నమోదైంది. 1990 ఆగస్టు 24న గోదావరి నీటిమట్టం 70.8 అడుగుల మేర ప్రవహించింది. ఏడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు గోదావరి 60 అడుగులకు పైకి చేరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

జలదిగ్బంధంలో ప్రజలు..

మణుగూరు వద్ద కూడా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అన్నారం, కమలాపురం, కొండయిగూడెం గ్రామాల సమీపంలోకి వరద నీరు వచ్చి చేరింది. చిన్నరాయిగూడెంలో కొన్ని కుటుంబాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొండయిగూడెం శివాలయాన్ని గోదావరి చుట్టుముట్టింది. భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఇంటెక్ వెల్​లోకి వరద నీరు వచ్చి చేరింది. ముంపు గ్రామాల ప్రజల కోసం అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

ఉగ్ర గోదావరి.. కొనసాగుతోన్న మూడో ప్రమాద హెచ్చరిక

ఇదీచూడండి: రాష్ట్రంలో ప్యాకేజింగ్ ఫిల్మ్ తయారీ ప్లాంట్‌ ఏర్పాటు

ABOUT THE AUTHOR

...view details