Pest In Cotton Crop: ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఈ ఏడాది సీజన్ మొదటి నుంచే వర్షాలు అనుకూలంగా కురవడంతో రైతులు సకాలంలోనే పత్తి పంటను సాగు చేశారు. ప్రభుత్వం పత్తి సాగు చేయాలంటూ అన్నదాతలకు సూచనలివ్వడం, ఆశించిన ధర పలుకుతుండటంతో.. ఎక్కువ శాతం మంది తెల్ల బంగారం పండించేందుకే మొగ్గుచూపారు. గత సీజన్‌లో మిర్చి సాగు చేసిన రైతులు కూడా ఈసారి పత్తి వైపు మళ్లారు.
ఖమ్మం జిల్లాలో 2,04,536 ఎకరాల్లో సాగవ్వగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 92,537 ఎకరాల్లో సాగు చేశారు. భారీ వర్షాలు, వరదల ధాటికి పత్తి పంటలో పెరుగుదల లోపించింది. విత్తనం నుంచి మొలకెత్తే దశలోనే పంటలు వరదలో మునిగిపోయాయి. కొన్నిచోట్ల రైతులకు నష్టం వాటిల్లింది. అధిక పెట్టుబడులతోపాటు పురుగుమందుల పిచికారి కోసం వేలకు వేలు ఖర్చు చేసి పంటను కాపాడుకున్నారు.
ఇప్పుడిప్పుడే రైతుల్లో ఆశలు చిగురిస్తుండగా ప్రస్తుతం కాత దశలో ఉన్న పత్తి పైర్లపై తెగుళ్ల దెబ్బ వెంటాడుతోంది. ఉభయ జిల్లాల్లో ప్రస్తుతం ఏపుగా పెరిగే దశలో ఉన్న పత్తి పంటపై తెగుళ్ల పిడుగు పడుతోంది. ఈసారి భిన్న వాతావరణ పరిస్థితుల కారణంగా పలు ప్రాంతాల్లో పత్తి కాండం లోపలికి పురుగు వెళ్లి తినేస్తుంది. ఫలితంగా మొక్క పూర్తిగా తేలిపోయి విరిగిపోతుంది.