తెలంగాణ

telangana

By

Published : Jun 18, 2019, 7:54 PM IST

ETV Bharat / state

అడవిబాటలో కష్టాల చదువులపై అధికారుల స్పందన

భద్రాద్రి కొత్తగూడెంలో అశ్వారావుపేట మండలం కొండతోగులో విద్యార్థుల చదువుల కష్టాలపై ఈనాడు- ఈటీవీలో వచ్చిన కథనాలపై అధికారుల స్పందించారు. చదువుకోసం కిలోమీటర్ల మేర వాగులు, వంకల్లో నడుస్తున్న చిన్నారుల కష్టం తీరేందుకు అధికారులు అదే గ్రామంలో తాత్కాలిక పాఠశాల ఏర్పాటు చేశారు.

అడవిబాటలో కష్టాల చదువులపై అధికారుల స్పందన

అడవిబాటలో కష్టాల చదువులపై అధికారుల స్పందన

మారుమూల గిరిజన గ్రామాల పిల్లలకు సైతం విద్యను అందించేందుకు వారి గ్రామాల్లోనే సకల సౌకర్యాలతో విద్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం పదేపదే చెప్తోంది. గిరిజనుల కోసం ప్రత్యేకంగా సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థనూ ఏర్పాటు చేసినా ఫలితం శూన్యం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలంలోని అడవి బిడ్డల గ్రామమైన కొండ తోగు ఇందుకు ఉదాహరణ. ఈ గ్రామం బడి పిల్లల కష్టాలపై ఈటీవీలో వచ్చిన కథనం అధికారులను కదిలించింది. చిన్నారుల కష్టాలు తీర్చింది.

అశ్వారావుపేట మండలం కొండ తోగులో బడికి వెళ్లాలంటే మూడు కిలోమీటర్లు పోవాలి. అది కూడా దట్టమైన అడవిలో వాగులు, వంకలు దాటుకుంటూ... రాళ్లు, రప్పల్లో నడుచుకుంటూ వెళితే కాని అక్షరాలు నేర్చుకోలేం. మార్గమధ్యంలో అటవీ జంతువుల భయాలు.. పొంగిపొర్లే వాగుల మధ్య చిన్నారులు పడే వేదన అంతా ఇంతా కాదు. అయినా చదువు పట్ల ఆ పిల్లల ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు.

ఈ పరిస్థితి మార్చాలని.. తమ గూడెంలోనే బడి ఏర్పాటు చేయాలని గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు... అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు.

అధికారుల నిర్లక్ష్య వైఖరి, పిల్లల కష్టలపై ఈనాడు- ఈటీవీ భారత్​ కథనాలు ప్రసారం చేసింది. దీనిపై విద్యాశాఖ అధికారి వాసంతి స్పందించారు. కొండతోగు గ్రామంలో పాఠశాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఉన్నతాధికారుల ఆదేశం మేరకు... మండల విద్యాశాఖ అధికారి కృష్ణయ్య పాఠశాల ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. గ్రామంలోని అద్దె ఇంట్లో పాఠశాలను ఏర్పాటు చేశారు. త్వరలోనే నూతన భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

తమ గ్రామంలో పాఠశాలను ప్రారంభించడం వల్ల గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. దీనికి కారణమైన ఈనాడు-ఈటీవీకి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చూడండి: నాన్న ఇక లేడని.. ఎప్పటికీ రాడనీ...!

ABOUT THE AUTHOR

...view details