తెలంగాణ

telangana

ETV Bharat / state

ముక్కోటి ఏకాదశి వేడుకలకు సిద్ధమైన భద్రాద్రి క్షేత్రం - భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు

ముక్కోటి ఉత్సవాల కోసం భద్రాద్రి రామయ్య ఆలయం ముస్తాబైంది. వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలతో... రాములోరి సన్నిధి ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. స్వామివారు రోజుకో అవతారంలో దర్శనమిస్తూ భక్తులను పరవశింపజేస్తున్నారు. ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సాయంత్రం తెప్పోత్సవం, శుక్రవారం వైకుంఠ ఉత్తర ద్వారా దర్శనం వైభవంగా జరగనున్నాయి.

MUKOTI
MUKOTI

By

Published : Dec 24, 2020, 5:49 AM IST

Updated : Dec 24, 2020, 8:12 AM IST

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల పేరిట.. ఈ నెల 15 మొదలైన వేడుకలతో భద్రాద్రి క్షేత్రం పులకించిపోతోంది. ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన తెప్పోత్సవం, వైకుంఠ ఉత్తర ద్వారా దర్శనం కోసం భద్రాద్రి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇవాళ సాయంత్రం జరిగే తెప్పోత్సవం, శుక్రవారం తెల్లవారుజామున నిర్వహించే ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముక్కోటి వేడుకల్లో అత్యంత ముఖ్యమైన ఈ వేడుకలను వీక్షించేందుకు ఏటా వేలాది మంది భక్తులు భద్రాద్రికి తరలివస్తుంటారు.

వేడుకలపై కొవిడ్​ ప్రభావం

ఈ ఏడాది ఉత్సవాలపై కొవిడ్‌ ప్రభావం పడింది. ప్రభుత్వాదేశాల మేరకు... ఈసారి తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం... భక్తుల సందడి లేకుండానే జరగనున్నాయి. ఏటా గోదావరిలో జరిపే తెప్పోత్సవ వేడుకను ఈసారి ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపం ఎదురుగా ఉన్న పుష్కరిణిలో నిర్వహించనున్నారు.

భక్తులు లేకుండానే...

శుక్రవారం తెల్లవారుజామున... మిథిలా ప్రాంగణం ఎదురుగా గల ఉత్తర ద్వారం నుంచి స్వామి వారు దర్శనమివ్వనున్నారు. ఈ వేడుకకు భక్తులకు అనుమతి లేదు. కేవలం అర్చకులు, ప్రముఖుల సమక్షంలో నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా కమనీయంగా సాగే తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు... ఈ సారి నిరాశ తప్పడం లేదు.

ఇదీ చూడండి:"సెల్ఫీ విత్ ఫార్మర్, మై ఫార్మర్-మై సెలబ్రిటీ"

Last Updated : Dec 24, 2020, 8:12 AM IST

ABOUT THE AUTHOR

...view details