ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి ప్రధానంగా పట్టణ ప్రాంతాలపై పంజా విసురుతోంది. తొలి రోజుల్లో పురపాలకాల్లో ఒకటి రెండు కేసులు నమోదుకాగా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఖమ్మం నగరంలో అయితే కొవిడ్ కేసులు కలవరపెడుతున్నాయి. ఇతర మున్సిపాలిటీల్లోనూ బాధితుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ప్రధానంగా గత నెల రోజులుగా వ్యాప్తి తీవ్రమవుతోంది. ఉభయ జిల్లాల్లోని కేసుల్లో దాదాపు 90 శాతం మున్సిపాలిటీల్లోనే కావటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. లాక్‌డౌన్ సమయంలో అదుపులో ఉన్నా.. అన్‌లాక్‌తో ఒక్కసారిగా పెరుగుతూ వస్తున్నాయి. మూడు నెలల కాలంలో గణాంకాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది.
వ్యాపార సముదాయాల్లో అప్రకటిత లాక్‌డౌన్
పట్టణ ప్రాంతాల్లో కొవిడ్ బాధితుల్లో ఎక్కువగా వ్యాపార వర్గాలే ఉంటున్నారు. నిత్యం పలు ప్రాంతాల నుంచి వారి వద్దకు వందల సంఖ్యలో వినియోగదారులు వస్తుండటం, వ్యాధి బారిన పడటం జరుగుతోంది. పట్టణాల్లో వ్యాపార, వాణిజ్య వర్గాలు తమకు తామే స్వచ్ఛంద లాక్‌డౌన్ విధించుకుని కేసుల అడ్డుకట్టకు పనివేళలను గణనీయంగా తగ్గించుకున్నాయి. అన్ని ప్రాంతాల్లో దాదాపు 90 శాతం వ్యాపారాలన్నీ సాయంత్రం 6 గంటలకే మూసేస్తున్నారు.
అధికారులు దృష్టి సారించాలి..
పురపాలక, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పట్టణాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వ్యాపార, వాణిజ్య కూడళ్లలో జన సమూహాలను నియంత్రించాలి. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న కాలనీల్లో కంటైన్‌మెంట్ తరహా కట్టడి చేయాలి. ద్రావణాల పిచికారీతో జల్లెడ పట్టాలి. పోలీసు శాఖ కూడా నిరంతరం తనిఖీలు చేస్తూ కొవిడ్ నిబంధనలు పాటించని వారిపై చర్యలకు ఉపక్రమించాలి. పైవన్నీ చేసినా ప్రజా చైతన్యంతోనే కరోనా కట్టడి పూర్తి స్థాయిలో సాధ్యమవుతుందని నిపుణులంటున్నారు.
ఎందుకిలా?
1. మున్సిపాలిటీలన్నీ వ్యాపార, వాణిజ్య కేంద్రాలు కావడం, ఇతర ప్రాంతాల వారు నిత్యం కోసం ఇక్కడికి వచ్చిపోతుండటం.
2. ఉద్యోగరీత్యా, వైద్య సేవల కోసం, వేడుకలకు వెళ్తుండటం, వస్తుండటం..
3. చిన్నపాటి లక్షణాలున్నా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నా కొందరు నిర్లక్ష్యం వహించడం.
4. చీటికీమాటికి విచ్చలవిడిగా రహదారులపై సంచరిస్తుండటం.
5. అనుమానితులు, వ్యాధి లక్షణాలున్న వారికి సరైన సమయంలో వ్యాధి నిర్ధారణ జరగకపోవటం.
6. మాస్కులు లేకుండా ప్రయాణిస్తుండటం. (నిబంధన ఉల్లంఘనులు ఖమ్మం జిల్లా వాసులే ఎక్కువగా ఉంటున్నారు).
ర్యాపిడ్ కిట్లు ఇలా..
* వైరాలో ఓ గృహిణి కరోనా అనుమానిత లక్షణాలతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ తేలింది. తనకూ పరీక్ష చేయాలని ఆమె భర్త ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నా ర్యాపిడ్ కిట్లు అందుబాటులో లేక మూడ్రోజులుగా నిరీక్షిస్తున్నారు.
* అన్ని పురపాలకాల్లోనూ ర్యాపిడ్ కిట్‌ల కొరత వేధిస్తోంది.
* భద్రాద్రి ఏరియా ఆస్పత్రిలో ఇప్పటివరకు 196 టెస్టులు చేయగా.. 45 పాజిటివ్ తేలాయి.