భద్రాచలంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జిల్లా అధికారులతో గోదావరి వరదలపై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి పునరావాసానికి తరలించాలని మంత్రి అన్నారు. ప్రథమంగా పునరావాసం ఏర్పాటు చేయడం తక్షణ కర్తవ్యమని పేర్కొన్నారు.
వరద పెరుగుతున్న వాగులు, రహదారుల్లో జన సంచారం లేకుండా చూడాలని ఆదేశించారు. అధికారులంతా ఆయా కేంద్రాల్లోనే ఉండి త్వరగా సమీక్షిస్తూ పునరావాసాలపై దృష్టి పెట్టాలన్నారు. విలీన మండలంలోని కూనవరం మండలంలోనే తాను జన్మించానని.. తన చిన్న నాడు ప్రతియేటా వరదల బారిన పడి పునరావాస కేంద్రాలకు వెళ్లేవాళ్లమని అప్పటి పరిస్థితులకు గుర్తుతెచ్చుకున్నారు.