రోడ్డు ప్రమాదాల నివారణపై రాష్ట్ర పోలీసు శాఖ దృష్టి సారిస్తోంది. పోలీసు ఠాణాల పరిధుల్లో ఎక్కడెక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయో గుర్తించాలన్నది డీజీపీ ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి మండలం పెనగడప వద్ద ముందస్తుగా చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని అక్కడి ప్రమాదాల తీవ్రత తెలియజేస్తోంది. గత మూడేళ్లలో ఈ గ్రామం వద్ద 29 మంది బలయ్యారు. 16 మంది తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో పోరాడారు.
ఆదాయం కోసం అతివేగం
రుద్రంపూర్ కోల్‌హ్యాడ్లింగ్ ప్లాంట్ (ఆర్‌సీహెచ్‌పీ), సత్తుపల్లి ఉపరితల గని మార్గం మధ్యలో ఉన్న ఆనందఖని, పెనగడప, రాంపూర్ గ్రామాల మధ్య బొగ్గు లారీల రాకపోకలు అధికంగా ఉంటాయి. కొన్ని ప్రైవేటు బొగ్గు లారీల డ్రైవర్లకు ఒక ట్రిప్పునకు ఇంత.. అని ధరను కేటాయించడం, వారు అధిక ఆదాయం కోసం ఆరాట పడుతుండటం వల్ల ఈ మార్గంలో ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయి. గ్రామాల మధ్య సరైన వీధి దీపాలు కూడా లేవు.
నైపుణ్యం ఉండాలి
అంతర్గత ప్రాంతాల్లో లారీలపై విధులు నిర్వర్తించిన కొందరు డ్రైవర్లకు నేరుగా పవర్ స్టీరింగ్ వాహనాలను అప్పగిస్తున్నారు. ప్రధాన రహదారులపై అలాంటి వాహనాలను నడపడానికి పూర్తిస్థాయి అనుభవం, ఓర్పు చాలా అవసరం. పైగా వేగాన్ని నియంత్రించే నైపుణ్యం కచ్చితంగా ఉండాలి. సాంకేతికపరమైన పూర్తిస్థాయి అనుభవం కూడా తప్పనిసరి. ఇవేమీ లారీల యజమానులు పరిగణనలోకి తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.