భద్రాచలంలో వైభవంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం Sri Rama Navami in Bhadradri : రామనామస్మరణతో భదాద్రి మారుమోగింది. దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాద్రిలో జగాలను ఏలిన జగదేకవీరుడు శ్రీరామచంద్రుడికి, జగన్మాత సీతమ్మకు అభిజిత్ లగ్నంలో జరిగిన కల్యాణ వేడుక.. ఆద్యంతం కనుల పండువగా సాగింది. కొవిడ్ ప్రభావంతో రెండేళ్లు సాదాసీదాగా జరిగిన రాములోరి కల్యాణాన్ని కనులారా వీక్షించి భక్తులు పునీతులయ్యారు. తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామస్వామి ఆలయంలో ఏడాదికి ఒకసారి జరిగే సీతారాముల వారి వార్షిక కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. జగదభిరాముడి కల్యాణ మహోత్సవం కనులారా వీక్షించి తరించేందుకు తరలివచ్చిన భక్త జన జయజయ ధ్వానాల మధ్య రాములోరి కల్యాణం జగత్ కల్యాణానికి అద్దం పట్టింది. వేద మంత్రోచ్ఛారణలు మారుమోగుతండగా.. అభిజిత్ లగ్న ముహూర్తాన జీలకర్ర మిశ్రమాన్ని సీతారాముల వారి శిరస్సుపై ఉంచగా... కల్యాణ ఘట్టం ఆవిష్కృతమైంది. శుభముహూర్తంగా.. జగత్ కల్యాణంగా భావించే శుభసన్నివేశంగా..ముల్లోకాలు మురిసే విధంగా మూడు ముళ్ల బంధానికి నిదర్శనంగా మాంగళ్యధారణ జరిగింది.
ఆద్యంతం రమణీయం: తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టంగా భక్తులు భావించే కల్యాణ మహోత్సవం..రామభక్తుల్ని ఆద్యంతం ఆకట్టుకుంది. కల్యాణ క్రతువు ప్రధాన ఆలయం నుంచి ప్రారంభమైంది. ఉదయం ప్రధాన ఆలయం నుంచి రాజవీధి గుండా ఊరేగింపుగా బయలుదేరిన సీతారాములకు ముందు రామదండు కీర్తనలు, భజనలు, కోలాటాలు అలరించాయి. మాఢవీధి గుండా సాగిన ఊరేగింపు కార్యక్రమం.. మిథిలా మండపానికి చేరుకుంది. ఈ సమయంలో రామయ్య పాదాలు తాకేందుకు, పల్లకి మోసేందుకు భక్తులు పోటీ పడ్డారు. పెళ్లి కూతురు సీతమ్మ తల్లిని కనులారా చూసి తరించేందుకు పోటీపడ్డారు. ఆ తర్వాత భక్తుల జయజయధ్వానాల మధ్య పెళ్లి మిథిలా మండపానికి చేరుకున్న సీతారాముల వారు... పీటలెక్కి అలరించారు. ఆ తర్వాత వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాద్యాల చప్పుళ్ల మధ్య మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
ఏమి భాగ్యం రామయ్య: ముందుగా కల్యాణానికి సంబంధించిన పూజలు మండపంలో జరిగాయి. ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. రాములోరి కల్యాణానికి ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అందజేశారు. ఆ తర్వాత తిరు కల్యాణానికి సంబంధించి సంకల్పం పలికి సర్వ విజ్ఞాన శాంతికి ఆరాధన జరిగింది. వధూవరులకు మంగళం చేకూర్చాలనే భావనతో అందించే ఈ ఆశీస్సులు కల్యాణం వీక్షించే భక్తులందరినీ పరవశింపజేశాయి. ఆ తర్వాత కల్యాణ వైభవాన్ని చాటిచెప్పేలా చూర్ణికను పఠించిన తర్వాత... వేద మంత్రోచ్ఛారణలు మారుమోగుతుండగా... అభిజిత్ లగ్నమున మాంగళ్యధారణతో సీతారాముల వారు ఒక్కటయ్యారు. ఈ కమనీయ ఘట్టాన్ని చూసిన భక్తజనం ఏమి భాగ్యం రామయ్య తండ్రీ అంటూ ముగ్ధులయ్యారు.
హాజరైన మంత్రులు.. భక్తులు భక్తుల అమితాసక్తి: కల్యాణం తర్వాత జరిగిన తలంబ్రాల వేడుక... సీతారాముల కల్యాణ మహోత్సవానికి మరింత వన్నెతెచ్చింది. రాముడి దోసిట పడిన తలంబ్రాలు నీలపు రాసులుకాగా..జానకి దోసిట తలంబ్రాలు మణిమాణిక్యాలై సాక్షాత్కరించిన అపురూప వేడుక భక్తుల మదిని దోచింది. ఈ ఉత్సవం జరుగుతున్నంత సేపు జై శ్రీరాం అంటూ నినదిస్తూ.. ప్రణమిళ్లారు. స్వామివారిపై పడిన తలంబ్రాలను తీసుకునేందుకు భక్తులు అమితాసక్తిని చూపారు. కమనీయ వేడుకను తిలకించేందుకు పలువురు ప్రముఖులు తరలివచ్చారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు, మంత్రి పవ్వాడ అజయ్ దంపతులు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్సీ తాతామధు సూదన్, ఎమ్మెల్యే పొదెం వీరయ్య హాజరయ్యారు. ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు గౌతమ్, అనుదీప్ హాజరయ్యారు. ఈసారి వేడుక ఘనంగా సాగటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాల్లో చివరిదైన మహాపట్టాభిషేక మహోత్సవం సోమవారం జరగనుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరుకానున్నారు.
ఇదీ చదవండి :సీత కథ.. మనకూ పాఠమే!