ప్రభుత్వపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా చిన్నచిన్న కారణాలతో సకాలంలో అవసరమైన సరకులు భద్రాచలంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు చేరడం లేదు. ఒక్కోసారి వచ్చినా అవి అవసరాలకు చాలడం లేదు. వచ్చిన కొద్దిపాటి ఆహార పదార్థాలను లబ్ధిదారులకు సర్దుబాటు చేయడం అంగన్‌వాడీ ఉపాధ్యాయులకు, ఆయాలకు కష్టంగా మారింది.
6 నెలల నుంచి 3 ఏళ్ల లోపు పిల్లలకు అన్ని పోషక విలువలతో కూడిన బాలామృతంతోపాటు నెలకు 16 గుడ్లు అందించాల్సి ఉంది. 3-6 ఏళ్ల చిన్నారులకు నిత్యం ఉదయం గుడ్డు, భోజనం, కుర్‌కురే ఇవ్వాలి. గర్భిణులు-బాలింతలకు ప్రతిరోజు గుడ్డు, భోజనం, పాలు ఇవ్వాలి. ఈ సరకులను అర్హులకు అందించాల్సి ఉండగా భారీగా కోత పడుతోంది.
స్థానిక కాలేజీసెంటర్, రాజుపేట, ఏఎంసీ కాలనీలలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించగా వీటికి రావాల్సిన మొత్తం రాలేదు. నెలకు 1000 గుడ్లు రావాల్సిన చోట 800 మాత్రమే వచ్చాయి. మిగతా వాటి సంగతి దేవుడికే తెలియాలి. నెలకు ఒక్కో గర్భిణికి సుమారు 5 లీటర్ల పాలను పంపిణీ చేయాల్సి ఉండగా కోత పడింది. ఈమధ్య కొన్ని కేంద్రాలకు పాడైన గుడ్లు రావడంతో వాటిని అంగన్‌వాడీలు తీసుకోలేదు. మరో కేంద్రంలో పప్పు రాలేదు. నూనె విషయంలోనూ ఇదే తంతు సాగుతోంది. సూపర్‌వైజర్ల నివేదికలకు క్షేత్ర స్థాయిలో సమస్యలకు పొంతనే ఉండడం లేదు.
ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం: వరలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి (డీడబ్ల్యూవో)
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పోషకాహారం అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. కొన్నిచోట్ల గుడ్లు అందించే విషయంలో జాప్యం జరిగినట్టు నా దృష్టికి వచ్చింది. గుత్తేదారుకు చేసే చెల్లింపు తగ్గిస్తాం. పిల్లల బరువు, ఎత్తును కొలిచి అందుకు తగ్గట్టు లేనివారిని గుర్తిస్తున్నాం. వీరిని భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఉన్న పోషకాహార చికిత్స కేంద్రంలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పక్కా భవనాలు కొన్ని నిర్మాణ దశలో ఉండగా ఇంకొన్ని ప్రతిపాదనలు చేస్తున్నాం. ఖాళీ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇస్తాం.
- మినీ కేంద్రాలు: 626
- జిల్లాలో ప్రధానఅంగన్‌వాడీ కేంద్రాలు: 1,434