తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR Visit:కాలినడకన సాగుతూ.. భరోసా ఇస్తూ.. - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్తలు

CM KCR Visit: వర్షంలోనే గోదావరి ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటించారు. ఏరియల్‌ సర్వేతోపాటు క్షేత్ర సందర్శన చేశారు. భద్రాచలం, రామన్నగూడెంలలో పునరావాస కేంద్రాల్లో బాధితులను పరామర్శించారు. వరద కష్టాల శాశ్వత నివారణకు చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.

కేసీఆర్‌
కేసీఆర్‌

By

Published : Jul 18, 2022, 4:37 AM IST

CM KCR Visit: గోదావరి వరద ధాటికి ఛిద్రమైన పలు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం విస్తృతంగా పర్యటించారు. బాధితులకు పూర్తి భరోసా ఇచ్చారు. శనివారం రాత్రి వరంగల్‌ చేరుకున్న సీఎం.. ఆదివారం ఉదయం 7.30 గంటలకు హనుమకొండ నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులో బయలుదేరారు. వాస్తవానికి ఆయన హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గాన్నే ఎంచుకు న్నారు.

భద్రాచలం పర్యటన అనంతరం ఏటూరునాగారం మండలం రామన్నగూడెంలో పర్యటించారు. రెండో చోట్లా సీఎం వర్షంలోనే కాలినడకన కలియతిరిగారు. పునరావాస కేంద్రాల్లో బాధితులను పరామర్శించారు. వరద కష్టాల శాశ్వత నివారణకు చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.

రెండుగంటలపాటు..

ఉదయం 11 గంటలకు భద్రాచలం చేరుకున్న సీఎం అక్కడ సుమారు రెండు గంటలపాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఎగువ నుంచి వస్తున్న వరద, భద్రాచలం వద్ద ప్రవాహం తీరుపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌, జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోదారమ్మ శాంతించాలంటూ పూజలు చేశారు. నదికి చీర, సారె, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు సమర్పించారు. కాలినడకన కరకట్టను పరిశీలించారు. ముంపులో ఉన్న రామాలయ పరిసర ప్రాంతాలను దూరం నుంచి వీక్షించారు. మోటార్లు సరిగా పనిచేయకపోవడంతో ఆలయ పరిసరాల్లో నీళ్లు నిలిచాయని సీఎంకు సమాచారం అందడంతో ఆయన అధికారులపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ముంపు రాకుండా ఉండాలంటే:కరకట్ట సామర్థ్యంపైనా నీటిపారుదల శాఖ నిపుణులతో సీఎం చర్చించారు. కరకట్ట ఎత్తు పెంచడంతోపాటు పొడిగించి బలోపేతం చేసే అంశాలపై సూచనలిచ్చారు. భద్రగిరికి ఏటా ముంపు సమస్య రాకుండా ఉండాలంటే ఈ ప్రాంతం సముద్రమట్టానికి ఎంత ఎత్తులో ఉందో నిపుణులతో చర్చించి 100 అడుగుల నీటిమట్టం నమోదైనా ముంపు రాకుండా ఉండేందుకు ఏం చేయాలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. విస్తా కాంప్లెక్స్‌ వద్ద శాశ్వత మోటార్లు బిగించేలా ఏర్పాట్లు చేద్దామని సూచించారు. రెండో విడత ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్‌ భద్రాచలం రావడం ఇదే మొదటిసారి.

సీఎంకు బాధితుల మొర:భద్రాచలంలోని శ్రీనన్నపనేని మోహన్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం సందర్శించారు. అక్కడ తలదాచుకుంటున్న బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు ఏటా వరద ముంపు సమస్యతో అల్లాడుతున్నామని.. శాశ్వత పరిష్కారం చూపాలని సీఎంకు మొరపెట్టుకున్నారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ఎత్తయిన ప్రదేశంలో అందరికీ ఇళ్లు కట్టిస్తాం వెళ్తారా అని వారిని ప్రశ్నించగా, వెళ్తామని బాధితులు బదులిచ్చారు.

సుదీర్ఘ ప్రయాణం:ఆదివారం ఉదయం హనుమకొండ నుంచి ఏటూరునాగారం వరకు అనేక చోట్ల రహదారిపై పొంగి పొర్లే వరదలో నుంచే కేసీఆర్‌ బస్సు ప్రయాణం కొనసాగింది. దట్టమైన అటవీ మార్గంలో భద్రాచలం వరకు సుమారు నాలుగు గంటలసేపు ఆయన పయనించారు. తిరుగు ప్రయాణంలో భద్రాచలం నుంచి ఏటూరునాగారం వరకు హెలికాప్టర్‌లో వచ్చినా, ఏటూరునాగారం నుంచి మళ్లీ హనుమకొండకు బస్సులోనే ప్రయాణించారు. ముఖ్యమంత్రి పర్యటనలో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి, పువ్వాడ, భద్రాచలం, ములుగు ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, సీతక్క, మాజీ మంత్రి తుమ్మల, ప్రభుత్వ విప్‌లు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రేగా కాంతారావు, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అటు సీఎం... ఇటు గవర్నర్‌ పర్యటనలు

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసైలు ఆదివారం వేర్వేరుగా వరద ప్రాంతాల్లో పర్యటించారు. సీఎం ఉదయం వరంగల్‌ నుంచి రోడ్డు మార్గాన భద్రాచలం చేరుకోగా... గవర్నర్‌ రైలులో సికింద్రాబాద్‌ నుంచి వెళ్లారు. ఇద్దరూ తమ పర్యటనల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముంపు బాధితులను పరామర్శించారు. సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. సీఎం ఏటూరునాగారంలోనూ పర్యటించారు. కేసీఆర్‌ భద్రాచలం, ఏటూరు నాగారం ప్రాంతాల్లో పర్యటించగా, గవర్నర్‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో బాధిత ప్రాంతాలను సందర్శించారు.

వరద ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే:భద్రాచలంలో పరిశీలన అనంతరం సీఎం హెలికాప్టర్‌లో ఏటూరునాగారం వరకు వరద ప్రాంతాలను ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం ఐటీడీఏ అతిథిగృహంలో భోజనం చేసి రామన్నగూడెం చేరుకున్నారు. అక్కడ గోదావరి పుష్కరఘాట్ వరకు సుమారు ఒకటిన్నర కిలోమీటర్లు కాలినడకన తీరాన్ని పరిశీలించారు.పునరావాస కేంద్రాన్ని సందర్శించారు.

ముఖ్యమంత్రికి తమ గోడును విన్నవించేందుకు వరద బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సీఎం వారిని అనునయించారు. భవిష్యత్తులో వరద ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఉత్తరాఖండ్‌లో తరచూ ఇంతకంటే భారీ వరదలను ఎదుర్కొంటున్నారని, మన దగ్గర శాశ్వత పరిష్కారం చూపడం సాధ్యం కాదా అని ఇంజినీరింగ్‌ అధికారులను సీఎం ప్రశ్నించారు. కరకట్టలను బలోపేతం చేసి మళ్లీ ముంపు సమస్య లేకుండా చూసేందుకు ప్రభుత్వం ఎంతైనా వెచ్చిస్తుందని తెలిపారు. అనంతరం ఏటూరు నాగారం ఐటీడీఏలో అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

ఇవీ చదవండి:Bandi on KCR: విదేశీ కుట్ర ఉందనడం శతాబ్దపు జోక్: బండి సంజయ్‌

రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం.. ఎన్​డీఏకే విజయావకాశాలు

ABOUT THE AUTHOR

...view details