భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రి నుంచి వాన కురుస్తోంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఇల్లందు ఉపరితల గనిలో పనులకు అంతరాయం ఏర్పడింది. వర్షపు నీరు చేరడంతో పనులు సజావుగా సాగడం లేదు. ఫలితంగా 1000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 10 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి.
మరోవైపు టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గనిలోనూ బొగ్గు ఉత్పత్తి పనులకు ఆటంకం కలిగింది. సుమారు 2,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 5 వేల టన్నుల మట్టి వెలికితీత పనులు వర్షం కారణంగా నిలిచిపోయాయి. ఈ వర్షం ఇలాగే కొనసాగితే బొగ్గు ఉత్పత్తికి మరింత నష్టం చేకూరే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా ఉత్పత్తికి విఘాతం కలిగిన నేపథ్యంలో పంపుల ద్వారా గనులలోని వర్షం నీటిని తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి షిఫ్టులో నిలిచిపోయిన ఉత్పత్తిని మరో షిఫ్టులో భర్తీ చేసుకునేలా ప్రణాళికలు వేస్తున్నారు. ఈ మేరకు కార్మికులను సిద్ధం చేస్తున్నారు.
ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఒక్క ఇల్లందులోనే 19.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. టేకులపల్లి, కామేపల్లి మండలాల్లోనూ జోరు వాన పడుతోంది. వర్షం కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వ్యవసాయ పనులకూ ఆటంకం కలగడంతో రైతన్నలూ ఇళ్లలోనే ఉండిపోయారు. ఎప్పుడెప్పుడు వాన తెరిపినిస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
ఇదీ చూడండి: Rains in Telangana: రాష్ట్రంలో జోరు వాన.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు