కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరాలు కురిపించారు. రూ.20 లక్షల కోట్లతో భారీ ప్యాకేజీని ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. విత్త మంత్రి బుధవారం ఎంఎస్‌ఎంఈలకు చేకూరే ప్రయోజనాలను వెల్లడించారు. లాక్‌డౌన్ సమయంలో తలెత్తుతున్న పరిస్థితులు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఆ ప్యాకేజీని ప్రకటించింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు ఊతం లభించనుంది. రూ.3 లక్షల కోట్ల రుణాల్లో ఉభయ జిల్లాలకు ఎంత? అన్న దానిపై ఉత్తర్వులు రావాల్సి ఉంది. రెండు జిల్లాల్లోని ఎంఎస్‌ఎంఈలు తాజాగా కేంద్రం ఇచ్చే రుణాలు తీసుకోవచ్ఛు. 12 నెలల వరకు రుణాలపై ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన పనిలేదు.
ఉభయ జిల్లాల్లో పరిస్థితి ఇదీ
- ఖమ్మం జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు 2018-19లో రూ.137 కోట్లతో 71 పరిశ్రమలు స్థాపించారు. తద్వారా 1,235 మందికి ఉపాధి లభించింది.
- టీఎస్‌ఐపాస్ ద్వారా 2018-19లో 103 పరిశ్రమలకు అనుమతులు లభించాయి. ఫలితంగా రూ.133.09 కోట్ల పెట్టుబడితో 1,196 మందికి ఉపాధి దొరికింది.
- పెట్టుబడి రాయితీ 2017-18లో 07 యూనిట్లకు రూ.1.27 కోట్లు మంజూరైంది.
- ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 35-45 శాతం వరకు పెట్టుబడి రాయితీ కింద 142 యూనిట్లకు రూ.1391.28 లక్షలు రాయితీ అందించారు.
- ఇటీవల 161 పరిశ్రమలకు అనుమతులు మంజూరయ్యాయి. తద్వారా రూ.391.23 కోట్లతో 1,669 మందికి ఉపాధి దొరికింది.
- భద్రాద్రి జిల్లాలో టీఎస్ ఐపాస్ కింద 58 పరిశ్రమలకు అనుమతులు మంజూరయ్యాయి. పెట్టుబడి రూ.10 కోట్లు కాగా 500 మందికి ఉపాధి దొరికింది.
- టిఫ్రైడ్ పథకంలో 91 మంది ఎస్సీలకు రూ.3.30 కోట్లతో 60 యూనిట్లు, 62 మంది ఎస్టీలకు రూ.4.87 కోట్లతో 31 యూనిట్లు మంజూరు అయ్యాయి.