తెలంగాణ

telangana

ETV Bharat / state

soil mafia: గుట్టలు మాయం.. రూ.కోట్లు కురిపిస్తున్న మట్టి వ్యాపారం - telangana varthalu

ప్రకృతి సంపదకు ఆనవాళ్లు గుట్టలు. ప్రకృతి రమణనీయతకు అద్దంపట్టేలా పచ్చందాలను తన ఒడిలో బంధించుకుని ఆహ్లాదం పంచేవి గుట్టలు. వందల ఏళ్ల నుంచీ చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఉంటూ స్థానికతకు నిలువుటద్దంలా నిలుస్తున్న గుట్టలు క్రమంగా కరిగిపోతున్నాయి. అధికారుల కళ్లముందే దర్జాగా సాగుతున్న మట్టిదందా అక్రమార్కులకు కాసులు కురిపిస్తుండగా.. ప్రకృతి సంపద రోజురోజుకు కరిగిపోతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా సాగుతున్న అక్రమ మట్టి తవ్వకాలతో గుట్టలన్నీ ఆనవాళ్లు లేకుండా కనుమరుగవుతున్నాయి. ప్రభుత్వానికి ఆదాయమైనా వస్తుందా అంటే అదీ లేదు. మామూళ్ల మత్తులో జోగుతున్న అధికార యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో.. అక్రమార్కులకు గుట్టలు కాసులు కురిపిస్తుండగా.. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది.

soil mafia: అక్రమార్కులకు రూ.కోట్లు కురిపిస్తున్న మట్టి వ్యాపారం
soil mafia: అక్రమార్కులకు రూ.కోట్లు కురిపిస్తున్న మట్టి వ్యాపారం

By

Published : Aug 20, 2021, 3:57 PM IST

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు అడవుల జిల్లాగా పేరుంది. రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లాల్లో ఉమ్మడి జిల్లాకు స్థానం ఉంది. రెండు జిల్లాల్లోనూ ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే గుట్టలు అనేకం ఉన్నాయి. ఖమ్మం నుంచి భద్రాద్రి జిల్లా దాటేవరకు అనేక ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్దీ ప్రకృతి ఒడిలో బందీగా ఉన్న గుట్టలు ఆహ్లాదాన్ని పంచుతాయి. ఇవే కాదు జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లోనూ గుట్టలు అనేకం ఉన్నాయి. కానీ..ఏళ్లుగా అధికారుల ఉదాసీనత, అక్రమార్కుల కాసుల కక్కుర్తితో గుట్టలన్నీ అన్యాక్రాంతమవుతున్నాయి. ఇష్జారాజ్యంగా సాగుతున్న మట్టి తవ్వకాలతో పచ్చదనం కనుమరుగైపోతూ గుట్టలన్నీ కరిగిపోతున్నాయి. ఈ పరిణామం పర్యావరణంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. అయినప్పటికీ గుట్టల నుంచి మట్టి తవ్వకాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.

ఖమ్మం గ్రామీణం మండలం గుర్రాలపాడులో మట్టి తవ్వకాలతో ఆనవాళ్లు కోల్పోయిన గుట్ట

అనుమతులు ఓ చోట.. తవ్వకాలు మరోచోట

గుట్టలపై మట్టి తవ్వకాలు సాగించాలంటే కచ్చితంగా ప్రభుత్వ అనుమతి ఉండాల్సిందే. అంతేకాదు.. సొంత భూముల్లో మట్టిని తరలించేందుకు సైతం రెవెన్యూ, గనుల శాఖల అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లోనైతే 1/70 చట్టం ప్రకారం గిరిజనేతరులకు ఏమాత్రం అవకాశం లేదు. గిరిజనులకే అనుమతి ఉంది. అది కూడా ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. మట్టి తవ్వకాల కోసం ముందుగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత మైనింగ్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సర్వేచేయాలి. ఎన్ని క్యూబిక్ మీటర్ల మట్టి తీసుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మట్టి తీయొచ్చు అన్నది హద్దులు నిర్ణయించాలి. సర్వే నెంబర్ల ఆధారంగా హద్దులు నిర్ణయించాలి. లీజు గడువు ముగిసిన తర్వాత తవ్వకాలు నిలిపివేయాలి. కానీ..ఎక్కడా ఈ నిబంధనలు పాటించడం లేదు. ఎక్కడో ఓ సర్వే నెంబర్​లో తవ్వకాలకు అనుమతి తీసుకుంటున్న మట్టి వ్యాపారులు.. ముందు అనుమతి లేని ప్రాంతాల్లో మట్టిని తోడేస్తున్నారు. ఆ తర్వాత నింపాదిగా అనుమతి తీసుకున్న ప్రాంతంలో తవ్వకాలు చేపడుతున్నారు. రాత్రింబవళ్లు తేడా లేకుండా గుట్టలను భారీ యంత్రాలతో తొలిచేస్తున్నారు. గుట్టలన్నింటిని గుల్లగుల్ల చేస్తున్నారు. చట్టాలకు తూట్లు పొడుస్తూ సామాజిక ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. అక్రమ తవ్వకాలు, అమ్మకాలు కళ్లెదుటే సాగుతున్నా ఎవరికీ పట్టడం లేదు.

టేకులపల్లి మండలం కరిశెలవాగు గుట్టపై సాగుతున్న మట్టి తవ్వకాలు

ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి

ఓ వైపు ప్రకృతి సంపద కళ్లముందే అన్యాక్రాంతమవుతుంటే.. మరి ప్రభుత్వానికి ఆదాయమైనా సమకూరుతుందా అంటే అదీ లేదు. ఒక ఘనపు మీటరు మట్టి తోలేందుకు ప్రభుత్వానికి రూ.20 చెల్లించాలి. గతంలో ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలింపు సాగేది. ప్రస్తుతం టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. ఒక టిప్పర్​లో 12 ఘనపు మీటర్ల వరకుమట్టి పడుతుంది. ఈ లెక్కన రాయల్టీ రూపంలో టిప్పర్​కు ప్రభుత్వానికి రూ.240 చెల్లించాలి. అంటే ఉమ్మడి జిల్లాలోని ఎక్కువ మండలాల నుంచి మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఇలా జిల్లావ్యాప్తంగా రోజుకు రాత్రింబవళ్లు సుమారు వెయ్యి టిప్పర్ల మట్టి అక్రమంగా తరలిపోతోంది. ఇలా నెలకు దాదాపు రూ.73 లక్షలు ప్రభుత్వ ఆదాయానికి అక్రమార్కులు గండి గొడుతున్నారు. ఈ లెక్కన ఏడాదికి సుమారు రూ.9 కోట్ల ఆదాయం ప్రభుత్వం కోల్పోతోంది. అంటే..అనుమతులు లేకుండా రాయల్టీ చెల్లించకుండానే ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు.

ఏన్కూరు మండలం జన్నారం రెవెన్యూలో మట్టితవ్వకాలతో కనుమరుగవుతున్న గుట్టలు

మామూళ్ల మత్తులో..

అక్రమ మట్టి తవ్వకాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన ప్రభుత్వ శాఖలు.. మామూళ్ల మత్తులో జోగుతూ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నందు వల్లే అక్రమార్కుల ఆటలు సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిరంతరం పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్న విమర్శలూ ఉన్నాయి. అంతేకాదు.. రాజకీయ పలుకుబడి అక్రమ మైనింగ్​పై తీవ్ర ప్రభావమే చూపుతోంది. అక్రమ మట్టి తవ్వకాలు సాగిస్తున్న ప్రాంతాల్లో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తే అధికార పార్టీ నేతల అందదండలు ఉన్నాయని చెప్పి వ్యాపారులు బెదిరింపులకు దిగుతున్నారు. ఫలితంగా అప్పుడో ఇప్పుడో తనిఖీలకు వెళ్లే అధికారులు నెలవారీలు అందుతుండటంతో చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.

మట్టి దందాలో మచ్చుకు కొన్ని..

  • ఖమ్మం నగరానికి కూతవేటు దూరంలో ఉన్న గుర్రాలపాడు, వెంకటగిరి, మద్దులపల్లి, తెల్దారుపల్లి, ఏదులాపురం, పెద్దతండా, ముత్తగూడెం, ఎంవీపాలెం, పోలెపల్లి, పల్లెగూడెంలోని గుట్టలన్నీ కరిగిపోయాయి. కాచిరాజుగూడెం, ముత్తగూడెం, గుర్రాలపాడు, వెంకటగిరిలోని గుట్టల్లో ఎటువంటి అనుమతులు లేకుండా ఇప్పటికీ భారీగా మట్టి తరలిస్తున్నారు.
  • రఘునాథపాలెం మండలంలోని కోయచలక, మంచుకొండ రెవెన్యూ పరిధిలో ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి. లోకాయుక్త వరకు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకున్న నాథుడే కరవయ్యాడు. ఈనాడు, ఈటీవీ భారత్​లలో వరుస కథనాలతో అధికారుల్లో కాసింత చలనం కనిపించినా..అది మూడ్రోజుల ముచ్చటగానే మిగిలింది. ఆ తర్వాత మళ్లీ యథావిథిగా వందల టిప్పర్ల కొద్దీ మట్టి తరలిపోతూనే ఉంది.
  • కామేపల్లి మండలం ముచ్చర్ల, రామస్వామి గుట్ట, నిమ్మవాగు గుట్టల నుంచి నిత్యం రాత్రిపగలు తేడా లేకుండా యథేచ్చగా మట్టి తరలిస్తున్నారు.
  • కారేపల్లి మండలం అప్పాయిగూడెం, గుట్టకింద గుంపు ప్రాంతాల్లో మట్టి తవ్వకాలతో గుట్టలన్నీ గుల్లగుల్ల అవుతున్నాయి.
  • కొణిజర్ల మండలం తుమ్మలపల్లి-తనికెళ్ల మధ్య ప్రభుత్వ భూముల్లోని గుట్టల్లో ఎటువంటి అనుమతి లేకుండానే మట్టిని తరలిస్తున్నారు.
  • ఏన్కూరు మండలం గార్ల ఒడ్డు, హిమాంనగర్, జన్నారం, తిమ్మారావుపేట, లచ్చగూడెం, రాజులపాలెం, మున్యాతండా, భద్రుతండా, ఒంటిగుడిసె గ్రామాల్లో గుట్టల నుంచి మట్టి తవ్వకాలు యథేచ్చగా సాగుతున్నాయి. గార్ల ఒడ్డు, జన్నారం ప్రాంతాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు మట్టిని తరలిస్తున్నారు.
  • సత్తుపల్లి మండలం రేజర్లలోని సత్తెమ్మ గుట్టలో ఎలాంటి అనుమతులు లేకుండా ఏళ్లుగా సాగుతున్న తవ్వకాలతో గుట్ట ఆనవాళ్లు కోల్పోతోంది.
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి, ఇల్లందు, ఆళ్లపల్లి, చర్ల, జూలూరుపాడు, పాల్వంచ మండలాల్లోనూ అక్రమ మట్టి దందా జోరుగా సాగుతోంది. టేకులపల్లి మండలం సీతారామ గుట్ట, కరిసెలవాగు గుట్ట, సంపత్ నగర్ గుట్టల నుంచి గుట్టుచప్పుడు కాకుండా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. అడపాదడపా రెవెన్యూ అధికారులు దాడులు చేసి సీజ్ చేస్తున్నా.. స్థానికంగా పలుకుబడి ఉన్న ప్రజా ప్రతినిధుల ఒత్తిడి మేరకు మళ్లీ వదిలేస్తున్నారు.
  • చర్ల మండలం లక్ష్మీకాలనీ, విజయకాలనీ, కలివేరు గుట్టల్లో నిత్యం మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు సాగుతుండటంతో గుట్టలన్నీ అన్యాక్రాంతమవుతున్నాయి. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పక్కనే ఉన్న గుట్టలపై నుంచి అభివృద్ధి పనుల పేరిట తవ్వకాలు సాగుతున్నాయి.

అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు

జిల్లాలో 4 ప్రాంతాల్లో మాత్రమే మట్టి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయి. మైనింగ్​కు ఎన్​ఓసీ ఇచ్చే వరకు మా బాధ్యత ఉంటుంది. లీజు గడువును మేం పర్యవేక్షిస్తాం. అనుమతుల్లేని ప్రాంతాల్లో మట్టి తవ్వకాలపై చర్యలు తీసుకునేందుకు ఇటీవల జిల్లా కలెక్టర్ టాస్క్​ఫోర్స్ బృందాలను నియమించారు. మండలాల వారీగా, జిల్లా వారీగా బృందాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు సభ్యులుగా ఉన్నారు. జిల్లాలో అనుమతి లేని చోట్ల సాగే మట్టి తవ్వకాలపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ వచ్చేలా చర్యలు చేపడుతున్నాం. -సంజయ్ కుమార్, మైనింగ్ ఏడీ, ఖమ్మం జిల్లా

ఇదీ చదవండి:KISHAN REDDY: 'తెలంగాణ తల్లి.. కేసీఆర్​ కుటుంబం చేతిలో బందీ అయింది'

ABOUT THE AUTHOR

...view details