భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి రేంజ్ పరిధిలోని గవ్వలగట్టు- లింగసముద్రం సమీపంలోని అటవీ ప్రాంతంలో పదుల ఎకరాలలో 40 ఏళ్ల నాటి పెద్ద పెద్ద వృక్షాలున్నాయి. ఆ మహావృక్షాలకు అటవీశాఖ అధికారుల అండదండలతో గిరిజనేతరులు నరికి... కలపను విక్రయిస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు. అంతటితో ఆగకుండా... భూములను సైతం ఆక్రమించుకున్నారు.
40ఏళ్ల నాటి వృక్షాలు నరికివేత... అధికారుల చోద్యం...! - ములకపల్లిలో భారీ చెట్ల నరికివేత
అడవుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు ప్రతిష్టాత్మక చర్యలు చేపడుతుంటే... కొందరు అక్రమార్కులు మాత్రం యథేచ్చగా చెట్లను మింగేస్తున్నారు. అడవిల్లోకి వెళ్లే పశువుల కాపరులు వద్ద అగ్గిపెట్టె, గొడ్డలి, కత్తి లాంటివి ఏవి ఉన్నా కేసులు పెడుతుంటే... కొంచెం కూడా జంకు లేకుండా భారీగా చెట్లను నేలమట్టం చేశారు. అడవులను పరిరక్షించాల్సిన వారే వాటిని భక్షిస్తున్న వైనం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో చోటుచేసుకుంది.
అటవీశాఖ అధికారుల ప్రమేయము తోటే ఈ తంతు కొనసాగుతున్నట్లు ఈ ప్రాంత గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా అటవీశాఖ అధికారులు మాత్రం చెట్లు నరికిన మాట వాస్తవమే... కానీ అందులో తమ ప్రమేయం లేదని బుకాయిస్తున్నారు. ఆ చెట్లు ఉన్న స్థలం అటవీ ప్రాంతం కాదని చెబుతున్నారు. వాస్తవానికి గిరిజన చట్టాలు అమలులో ఉన్న ప్రాంతాల్లో ఉన్న చెట్లను నరికేయడం చట్టవిరుద్ధం.
ఇదే అంశంపై ములకలపల్లి రేంజర్ శ్రీనివాసరావును ఈటీవీ భారత్ వివరణ కోరగా... భారీగా చెట్లను నరికివేసిన విషయం నిజమేనని ఒప్పుకున్నారు. ఈ ఘటనతో తమ శాఖ వారికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే చెట్లను నరికేసిన అంశంలో 13 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.