తెలంగాణ

telangana

ETV Bharat / state

వరదతో అల్లాడిపోతున్న భద్రాద్రి జిల్లా.. క్షణక్షణం ఆందోళన.. - godavari river latest update

గోదావరి మహోగ్రరూపానికి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లాడిపోతోంది. భద్రాచలం, మణుగూరు, బూర్గంపాడులోని పలు కాలనీలు పూర్తిగా నీటమునిగాయి. లోతట్టు కాలనీల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో పత్తి, మిర్చి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

గోదావరి మహోగ్రరూపం.. అల్లాడిపోతున్న భద్రాద్రి జిల్లా
గోదావరి మహోగ్రరూపం.. అల్లాడిపోతున్న భద్రాద్రి జిల్లా

By

Published : Jul 15, 2022, 6:20 PM IST

Updated : Jul 15, 2022, 7:02 PM IST

వరదతో అల్లాడిపోతున్న భద్రాద్రి జిల్లా.. క్షణక్షణం ఆందోళన..

భారీ వర్షాలు, వరదలతో వెల్లువెత్తిన గోదారమ్మ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. భద్రాచలం, మణుగూరు, బూర్గంపాడు పట్టణాలు సహా 89 పల్లెలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సారపాక, నాగినేనిప్రోలు, రెడ్డిపాలెంతో పాటు విలీన మండలాలైన కూనవరం, వేలేరుపాడులో వందలాది గ్రామాలు ముంపు బారినపడ్డాయి. బాధితులను రక్షించేందుకు సింగరేణి రెస్క్యూ బృందంతో పాటు.. ఎన్డీఆర్​ఎఫ్​ సిబ్బంది రంగంలోకి దిగారు. ఆయా గ్రామాల పరిధిలో వరదలో చిక్కుకున్న 10 వేల మంది బాధితులను రక్షించే పనిలో పడ్డారు. సారపాక ఐటీసీ కాగిత కర్మాగారంలోకి వరద నీరు చేరడంతో యాజమాన్యం ప్లాంటును తాత్కాలికంగా మూసివేసింది.

భద్రాచలం వద్ద 70 అడుగులకు పైన నీటిమట్టం దాటి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల జనం భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. 1986 నాటి వరదలను మించి వస్తాయనే భయంతో జంకుతున్నారు. ఇప్పటికే చాలా మంది వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు వచ్చేందుకు కొంతమంది మొరాయిస్తున్నప్పటికీ మంత్రి పువ్వాడ, కలెక్టర్ అనుదీప్ ఆయా ప్రాంతాల్లో పర్యటించి.. అవగాహన కల్పిస్తున్నారు. ప్రాణనష్టం జరగకుండా జిల్లా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతోంది. పలుచోట్ల ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందటం లేదని.. బాధితులు వాపోతున్నారు.

నీటి సరఫరాకు బ్రేక్..: కొత్తగా నిర్మిస్తున్న భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోకి ప్రవాహం వచ్చింది. ప్లాంట్ ఆవరణలోని కోల్​ స్టాక్​ పాయింట్ వద్దకు జలాలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్లాంట్​కు నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టారు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా మిషన్ భగీరథ నీటి సరఫరాను అధికారులు నిలిపివేశారు. మిషన్ భగీరథ ఇంటెక్ వేల్, సబ్ స్టేషన్ వద్దకు వరద చేరడంతో ముందస్తు చర్యల్లో భాగంగా సరఫరా ఆపేశారు. విద్యుత్ స్తంభాలు, తీగలు ప్రమాదకరంగా మారాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వరద ధాటికి పత్తి, మిర్చి పొలాల్లో ఇసుక భారీగా మేటలు వేసింది. గొడ్డుగోద, పిల్లాపాపలతో ముంపు ప్రాంతాల్లో భయం గుప్పిట జనం జీవిస్తున్నారు.

దెబ్బతిన్న ఇళ్లు..: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల పరిధిలో కర్నగూడెం, ఇప్పనపల్లి, రాయిలంక రామాంజిగూడెం, తీగలంచ.. గ్రామాల్లో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. బాధిత కుటుంబాలకు తహసీల్దార్ మహమ్మద్ సాదియా సుల్తానా.. రెవెన్యూ సిబ్బందితో కలిసి బాధితులకు తక్షణ సహాయం కింద బియ్యం, వంట సరుకులను అందజేశారు.

Last Updated : Jul 15, 2022, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details