సింగరేణి కాలరీస్‌లో జూనియర్ నర్సుల పోస్టుల భర్తీలో కేవలం మహిళలకే అవకాశం కల్పించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఎలాంటి చట్టం, నిబంధన, విధాన నిర్ణయం లేకుండా లింగవివక్ష చూపుతూ సింగరేణి కాలరీస్ తీసుకున్న నిర్ణయం చెల్లదని పేర్కొంది. ఏడు విభాగాల్లో పోస్టుల భర్తీకి సింగరేణి కాలరీస్ జనవరి 22న జారీచేసిన నోటిఫికేషన్‌లో ‘నర్సు పోస్టులకు కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలనే’ నిబంధన పెట్టడాన్ని సవాలు చేస్తూ మహమ్మద్ ఫసియుద్దీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పి.నవీన్‌రావు విచారణ చేపట్టారు.
నర్సు పోస్టుల భర్తీలో లింగవివక్ష తగదు: హైకోర్టు
నర్సు పోస్టుల భర్తీలో లింగవివక్ష తగదని హైకోర్టు స్పష్టం చేసింది. అర్హులైన పురుషులకూ అవకాశం కల్పించాలని ఆదేశించింది. దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగించాలని సింగరేణి కాలరీస్‌కు సూచించింది.
కేవలం మహిళలకే అవకాశం కల్పించాలన్న నిబంధనలేవీ నిర్దేశించలేదని, నర్సుల పోస్టులను మహిళలతో భర్తీచేయడం ఆనవాయితీగా వస్తోందని సింగరేణి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి నోటిఫికేషన్‌లో మహిళలకే అవకాశం కల్పించడాన్ని చట్టం అనుమతించదని పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగించాలని, నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతల ప్రకారం అర్హులైన పురుషుల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించాలని సింగరేణి కాలరీస్‌ను ఆదేశించారు. ఈ మొత్తం నియామక ప్రక్రియ తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:గ్రేటర్ పీఠంపై ఉత్కంఠ: ఎవరి బలం ఎంత?