బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. కొద్దిసేపు భారీ వానలతో బెదరగొట్టి మరి కాసేపు చిరుజల్లులతో మైమరిపిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి ఏకధాటిగా వానలు పడుతున్నాయి.
ప్రాజెక్టులకు వరద
వర్షాల కారణంగా నీటి ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 8.5 అడుగులు ఉంది. ఎగువ ప్రాంతాల్లోని ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయడంతో.. ఈ రోజు రాత్రిలోపు గోదావరి నీటిమట్టం 20 అడుగులకు చేరుతుందని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎస్సారెస్పీకి వరద నీరు
వర్షాలతో నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 78 వేల క్యూసెక్కుల వరద నీరు చేరగా... నీటి మట్టం 1078.80 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 34 టీఎంసీల నీరు నిల్వ ఉంది.