రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో... ప్రాజెక్టులు, జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీగా వరద వచ్చి చేరడంతో.. ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలోని కుమురం భీం, వట్టివాగు జలాశయాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. భారీగా వరద రావడంతో.. గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. కుమురం భీం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా... ప్రస్తుతం 241. 30 ఉంది. 3వేల 299 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తుండడంతో... ఐదు గేట్ల ఎత్తి వెయ్యి 92 క్యూసెక్కుల నీటిని కిందకి వదిలారు. వట్టివాగు జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 239.500 మీటర్లు కాగా... ప్రస్తుతం 238 మీటర్లకు చేరింది.
విస్తారంగా వర్షాలు.. జలకళ సంతరించుకున్న జలాశయాలు - kinneresani project
09:26 July 08
విస్తారంగా వర్షాలు.. జలకళ సంతరించుకున్న జలాశయాలు
పెద్దపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు పార్వతి, సరస్వతి బ్యారేజీల్లో జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో.. అధికారులు వంతుల వారీగా గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పరిసరాల్లోని గోదావరి ఒడ్డున ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మేడిగడ్డ బ్యారేజీలో భారీగా నీరుండడంతో... 35 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీకి 92వేల 720 క్యూసెక్కుల ప్రవాహం రాగా... 35 గేట్లు ద్వారా అంతే స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. సరస్వతి బ్యారేజీలో 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని పంపిస్తున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఖమ్మం వద్ద మున్నేరు నది ఉదృతంగా ప్రవహిస్తొంది. ఎగువన వరంగల్, మహబుబాబాద్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు మున్నేరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. భద్రాచలం వద్ద కొద్ది రోజుల క్రితం రాళ్లు, రప్పలు, ఇసుక తిన్నెలతో కనిపించిన గోదావరి... ప్రస్తుతం నిండా నీటితో కనువిందు చేస్తుంది. ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చిచేరింది. దీంతో 20 గేట్లను ఎత్తి... 11వేల 912 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు.
ఇవీ చూడండి..