Group 1 Prelims cancelation effect కడుపేదరికంలో కూలి పని చేసుకుంటూ... ఇద్దరు ఆడపిల్లలను చదివించి గ్రూప్-1 వస్తుందని ఆశతో ఎదురుచూసిన ఆ తల్లి ఆశలు అడియాశలు అయ్యాయి. దివ్యాంగురాలైన కుమార్తెకు ఏదో ఒక ఉద్యోగం వస్తే... తన కాళ్ల మీద తను బతుకుతుందని ఎదురుచూసిన ఆమె కళ్లు కన్నీళ్ల పర్యంతమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శాంతినగర్ కాలనీకి చెందిన బాసిపోగు మల్లయ్య, తిరుపతమ్మలకు ఇద్దరు కుమార్తెలు.
ఆర్థికంగా కడుపేదరికంలో ఉన్నవారు మల్లయ్య కూలి పనులు చేస్తుండగా... తిరుపతమ్మ చుట్టుపక్కల ఇళ్లల్లో ఇంటి పనులు చేసి కాలం గడుపుతుంది. ఇద్దరు ఆడపిల్లల్లో భవాని చిన్ననాటి నుంచి దివ్యాంగురాలు. చెవులు వినపడకపోవడం వల్ల... మాటలు సరిగా మాట్లాడలేదు. 60 శాతం దివ్యాంగురాలుగా ప్రభుత్వం గుర్తించింది. నానా బాధలు పడి ఇద్దరు కుమార్తెలను చదివిస్తున్న తిరుపతమ్మ చుట్టుపక్కల వారి ఆర్థిక సాయంతో గ్రూప్ 1 ఫిలిమ్స్ పరీక్షలు రాయించింది. ప్రిలిమ్స్ పాస్ అయింది. ఉద్యోగం వస్తుందని ఆశతో ఎదురుచూస్తోంది.
పరీక్షల్లో పాస్ అవడంతో దివ్యాంగురాలు అయిన కుమార్తెకు ఏదో ఒక ఉద్యోగం వస్తుందని ఆశపడింది. తీరా గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడంతో వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. భవాని తల్లి తిరుపతమ్మ కన్నీరుగా విలపిస్తోంది. మళ్లీ పరీక్షలు రాయాలన్నా... ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని... ఇప్పుడు నానా కష్టాలు పడి పరీక్ష రాసిన ప్రభుత్వం రద్దు చేయడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు, ఇబ్బందులు పడుతున్నారు. గ్రూప్ మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతున్న క్రమంలో ఇలా పరీక్షలు రద్దు చేయడం బాధాకరమైన విషయమని ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఏదో ఒక ఉద్యోగం ఇప్పించాలని భవానీ తల్లి తిరుపతమ్మ కోరుతోంది. ఇప్పుడు ఆ కుటుంబానికి ఉండటానికి ఇల్లు లేకపోవడంతో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి నాగేంద్ర ప్రసాద్ ఆశ్రయం ఇచ్చారు. అద్దె లేకుండా ఇల్లు ఇచ్చారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి వేడుకుంటున్నారు.
చెవులు వినిపించాలంటే.. 50వేలు కావాలన్నారు. డబ్బులు లేక వైద్యం చేయించలేదు. నాలుగు ఇళ్లలో పని చేసి... నా బిడ్డలను చదివిస్తున్నాను. నా బిడ్డకు ఏదో ఒక ఉద్యోగం వస్తుందని ఆశించాను. కానీ ఇప్పుడు ఇలా అయింది. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నా... -తిరుపతమ్మ, భవాని తల్లి