భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో నిర్మించే సీతమ్మ సాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా రుణం తీసుకుంటున్నట్లు ప్రకటించింది. పవర్ ఫైనాన్స్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం 3,426 కోట్ల రూపాయల అప్పు తీసుకునేందుకు అనుమతించిన ప్రభుత్వం.. విధివిధానాల్లో మార్పులు, చేర్పులకు ఆమోదం తెలిపింది. అందుకు అనుగుణంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్తో ఒప్పందం చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ ఎండీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కరీంనగర్ జిల్లా వీణవంక గ్రామం సమీపంలో కలువల వాగుపై నిర్మించే చెక్ డ్యాం నిర్మాణ వ్యయాన్ని ప్రభుత్వం సవరించింది. కోటి 97 లక్షల రూపాయల వ్యయానికి 2016 జనవరిలో పరిపాలనా అనుమతులు ఇవ్వగా.. తాజాగా ఆ మొత్తాన్ని రెండు కోట్ల 45 లక్షల రూపాయలకు నిర్మాణ వ్యయాన్ని పెంచింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.