Governor And CM Bhadradri Visit : గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. వరద పరిస్థితులను పరిశీలించడంతో పాటు బాధితులను పరామర్శించనున్నారు. ఈరోజు రాత్రి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రైలులో కొత్తగూడెంకు బయల్ధేరుతారు. అక్కడి నుంచి భద్రాచలం వెళ్తారు. గోదావరి వరద కారణంగా జిల్లాలో ఉత్పన్నమైన పరిస్థితులను పరిశీలించడంతో పాటు వరద బాధితులతో గవర్నర్ మాట్లాడనున్నారు. ఈరోజు.. దిల్లీలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇచ్చే విందులకు గవర్నర్ హాజరుకావాల్సి ఉండగా.. భద్రాచలం పర్యటన నేపథ్యంలో ఆ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు.
భద్రాద్రిలో రేపు గవర్నర్ తమిళిసై పర్యటన
Governor And CM Bhadradri Visit : గోదారమ్మ మహోగ్ర స్వరూపంతో.. భద్రాద్రి వణికిపోతోంది. వరదలతో అతలాకుతలమవుతోన్న జిల్లాలో రేపు గవర్నర్ తమిళిసైతో పాటు సీఎం కేసీఆర్ వేర్వేరుగా పర్యటించనున్నారు. తమిళిసై.. భద్రాచలంలోని వరద బాధితులను కలుసుకోనుండగా.. సీఎం కేసీఆర్ గోదావరి ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే చేయనున్నారు.
మరోవైరు... గోదావరి పరివాహక ప్రాంతాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఉదయం ఏరియల్ సర్వే చేయనున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో చోటుచేసుకున్న ప్రకృత్తి విపత్తు, గోదావరి పరీవాహక ప్రాంతంలో పోటెత్తిన వరదలపై సమీక్షించనున్నారు. కడెం నుంచి భద్రాచలం వరకున్న గోదావరి పరీవాహక ప్రాంతంలో సీఎం ఏరియల్ సర్వే కొనసాగనుంది. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ సర్వేలో పాల్గొననున్నారు. సీఎం చేపట్టే ఏరియల్ సర్వేకు సంబంధించిన హెలికాప్టర్ రూటుమ్యాప్ సహా తదితర విధి విధానాలను అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తోంది.
వరదల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం గోదావరి వరద ముంపు ప్రాంతాల్లోని దవాఖానాలకు చెందిన వైద్యులు, ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రేపు సీఎం పర్యటన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన కార్యాచరణపై వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది.