తెలంగాణ

telangana

ETV Bharat / state

TS Governor Bhadradri Tour : 'అడవిబిడ్డల ముఖాల్లో.. చిరునవ్వు చూడాలనుంది' - Telangana Governor Khammam Tour Updates

TS Governor Bhadradri Tour : అసమానతల గొలుసులను తెంచుకుని.. సమాన అవకాశాల కోసం ప్రతి ఆదివాసీ నడుంబిగించాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పిలుపునిచ్చారు. అడవిబిడ్డల కోసం ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా ఇప్పటికీ ఆశించిన అభివృద్ధి సాధించకపోవటం బాధాకరమన్నారు. భద్రాచలం పర్యటనలో భాగంగా ఆదివాసీలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె విలీన గ్రామాలు, ముంపు సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు

Etv Bharat
Etv Bharat

By

Published : May 17, 2023, 5:14 PM IST

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న గవర్నర్‌ తమిళి సై

TS Governor Bhadradri Tour : భద్రాచలం పర్యటనలో భాగంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన తమిళిసైకి మేళతాళాల మధ్య పూర్ణకుంభంతో ఆలయ EO, ఇతర అధికారులు స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలోని సీతారాముల ఎదుట ప్రత్యేక పూజల్లో గవర్నర్‌ పాల్గొన్నారు. ఉపాలయంలో లక్ష్మీతాయారు అమ్మవారి వద్ద వేదపండితులు.... వేదఆశీర్వచనం అందించారు. అనంతరం, శాలువాతో సత్కరించి.... స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయంలో పర్యటించే క్రమంలో అక్కడున్న భక్తులతో తమిళిసై ముచ్చటించారు.

Telangana Governor Khammam Tour Updates : భద్రాద్రి రామయ్య దర్శనం అనంతరం, పట్టణ శివారులోని ఓ కల్యాణమండపంలో గవర్నర్‌ ఆదివాసీలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆదివాసీలు ఈ సందర్భంగా తమ సమస్యలను ఒక్కొక్కరుగా ఆమెకు మొరపెట్టుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు అమలుచేస్తున్నా ఆదివాసీల జీవితాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేకపోవటానికి కారణాలను తెలుసుకుంటామన్నారు. రాజ్‌భవన్‌ నుంచి గిరిజన, ఆదివాసీలకు అందజేస్తున్న తోడ్పాటును ఈ సందర్భంగా గవర్నర్‌ వివరించారు. అడవిబిడ్డలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు అందరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

"ప్రజలందర్ని సామాజికంగా, ఆర్థికంగా, విద్యా పరంగా అభివృద్ధి చేయడంలో అందరం కలసి పని చేయాలి. నా వంతుగా రాజ్‌భవన్‌ నుంచి ఆరోగ్య రక్షణకు అంబులెన్స్‌లు, ఎలక్ట్రిక్‌ ఆటోలు ఇవ్వడం ఆనందంగా ఉంది. పాఠశాల్లో అదనపు తరగతి గదులు, అంగన్‌ వాడీ నిర్మాణాలు.. మీ పిల్లల చదువుల కోసం సాయం చేయడం చాలా సంతోషంగా ఉంది. మహిళా సాధికారత కోసం మరిన్ని నిధులు త్వరలో ఇవ్వనున్నాం. గిరిజనులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తాను. సరైన పోషకాహారం లేక చాలా మంది పిల్లలు, మహిళలు బలహీనులుగా మిగిలిపోతున్నారు. అసమానతల గొలుసులు తెంచేందుకు ప్రతి గిరిజన వ్యక్తి కలసి ప్రయత్నించాలి." - తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర గవర్నర్

జిల్లాకు వచ్చిన గవర్నర్‌కు స్థానిక ఎమ్మెల్యే పోదెం వీరయ్య స్థానికంగా ఉన్న సమస్యలను ఏకరవు పెట్టారు. ఆంధ్రాలో విలీనం చేసిన 5 గ్రామాలను తెలంగాణలో మళ్లీ కలిపేలా కృషి చేయాలని, భద్రాచలం ముంపు సమస్య పరిష్కరానికి కృషి చేయాలని పోదెం కోరారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని గవర్నర్‌ హామీ ఇచ్చారు. అనంతరం, రెడ్‌క్రాస్‌ సొసైటీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి తమిళిసై హాజరయ్యారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details