భద్రాచలంలో వరద ఉద్ధృతి తగ్గినట్టే తగ్గి మళ్లీ క్రమంగా పెరుగుతోంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు గోదావరి నీటిమట్టం 50.5 అడుగులకు చేరింది. మధ్యాహ్నం వరకు 48 అడుగులకు నీటి మట్టం పెరగ్గా.. అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇంకా నీటి మట్టం పెరుగుతుందని సీడబ్ల్యూసీ అధికారులు తెలుపుతున్నారు. గత రెండు రోజుల నుంచి రామాలయం సెంటర్లో గల అన్నదాన సత్రంతో పాటు చాలా దుకాణాలు వరద నీటిలోనే మునిగి ఉన్నాయి.
ఇంకా పెరుగుంతుందని అంచనా...
భద్రాద్రి రామయ్య సన్నిధి తూర్పు మెట్ల వద్ద వరద పోటెత్తుతోంది. భద్రాచలంలోని ఏజెన్సీ మండలాలకు నాలుగు రోజుల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు పెరగటం వ్లల ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. గత రాత్రి నుంచి భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు మండలాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల వల్ల భద్రాచలంలో ఇంకా గోదావరి నీటి మట్టం పెరుగుతుందని అధికారులు తెలిపారు.
జోరు వర్షాలతో ఏజన్సీ ప్రాంతాలు అతలాకుతలం...
గోదావరి తీరం వెంట జోరుగా వర్షాలు కురవడం, కాళేశ్వరం, ఇంద్రావతి, పేరూరు వైపు నుంచి భారీగా వరద చేరడం వల్ల భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవాహం కొనసాగుతుంది. నీటిమట్టం మళ్లీ పెరుగుతుండగా... అధికారులు అప్రమత్తమయ్యారు. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు చేసి అత్యసవసరం ఉన్నవారికి సాయం చేస్తున్నారు. ఓ వైపు భారీ వర్షాలు కురవడం, మరోవైపు గోదావరికి వరద పోటెత్తడంతో గోదావరి పరివాహక ప్రాంతాలు, ఏజెన్సీ మండలాలు మరోసారి అతలాకుతలమయ్యాయి. చర్ల, దుమ్ముగూడెం, పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, గుండాల, ఆళ్లపల్లి మండలాలు వరదలు, భారీ వర్షాల ధాటికి విలవిలలాడాయి. మణుగూరు పట్టణాన్ని భారీ వర్షం ముంచెత్తింది.