మూడురోజులుగా భారీ వర్షాలు.. పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతోపాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో... గోదావరి నీటిమట్టం పెరగుతోంది. భద్రాచలం వద్ద 32.7 అడుగులకు చేరుకుంది. తాలిపేరు జలాశయం 11 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. 29.5 అడుగుల నీటిమట్టం రాత్రి నుంచి పెరుగుతూ ఈ రోజు ఉదయం ఏడు గంటలకు 32.7 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల ఇంకా నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు చెబుతున్నారు. తాలిపేరు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈరోజు ఉదయం నుంచి 11 గేట్లు ఎత్తి 32,885 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నీటిమట్టం పెరగనుందని అధికారులు అంటున్నారు.