Godavari river water level at Bhadrachalam :రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు.. ఎగువ ప్రాంతాలనుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది. నిన్నటి వరకు 39 అడుగుల వద్ద ప్రవహించిన గోదావరి.. ఈరోజు ఉదయానికి 40 అడుగులకు చేరింది. రాత్రి 7 గంటలకు 46.7 అడుగులకు వద్దకు చేరి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు.
భద్రాచలం ఎగువన ఉన్న తాలిపేరు ప్రాజెక్టు నుంచి 23 గేట్లు ఎత్తి.. రెండున్నర లక్షల క్యూసెక్కుల వరద నీటిని కిందికి వదులుతున్నట్టు లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రియాంక అలా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం లేదా రాత్రి వరకు.. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి.. 48 అడుగుల వరకు పెరగవచ్చు అని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలుపుతున్నారు.
ఈ నెల 20న మొదటిసారి గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు. మధ్యలో రెండు రోజులు వరుణుడు శాంతించడంతో గోదావరి ఉద్ధృతి తగ్గింది. ఎగువనున్న తాలిపేరు ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదతో జులై 23న ఉదయం 43.3 అడుగుల ప్రమాదకరస్థాయికి చేరుకోవడంతో మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు.గోదావరి ప్రవాహం 43 అడుగుల వద్దకు నీటిమట్టం చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక.. 48 అడుగులకు చేరితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.