తెలంగాణ

telangana

ETV Bharat / state

గోదావరికి మళ్లీ వరద హోరు... ప్రమాదకర స్థాయిలో ప్రవాహం

శాంతించినట్లే కనిపించిన గోదావరికి మళ్లీ వరద పోటెత్తుతోంది. ప్రాణహితకు ప్రవాహ ఉద్ధృతితో... కాళేశ్వరం బ్యారేజీల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది.

Godavari floods again in telagnana
గోదావరికి మళ్లీ వరద హోరు... ప్రమాదకర స్థాయిలో ప్రవాహం

By

Published : Sep 2, 2020, 2:13 PM IST

ఎగువ నుంచి గోదావరికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న వర్షాలతో.. కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం ఘాట్ వద్ద 12.27 మీటర్లు మేర ప్రవాహం ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ఉభయ నదులు ప్రవహిస్తున్నాయి. భారీ వరదతో కాళేశ్వరం వద్ద పూజలు, పుణ్యస్నానాలు నిలిపివేశారు. తీర ప్రాంతంలోకి ఎవరినీ రానివ్వకుండా భారీ గేట్లు ఏర్పాటు చేసి పోలీసులు ఆంక్షలు విధించారు.

మేడిగడ్డ బ్యారేజీకి భారీగా వరద కొనసాగుతోంది. బ్యారేజీలో 85 గేట్లకు గాను 75 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతం నుంచి 9 లక్షల 69 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా... అంతే స్థాయిలో దిగువకు పంపుతున్నారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీలో 8.7 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సరస్వతి బ్యారేజీకి 10 వేల 600 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా... 8 గేట్ల ద్వారా అంతే స్థాయిలో నీటిని కిందకు వదులుతున్నారు.

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఉదయం 10 గంటలకు ప్రవాహ ఉద్ధృతి 41 అడుగులకు చేరుకుంది. 7లక్షల 72వేల 359 క్యూసెక్కుల ప్రవాహం దిగువకు పరుగులు తీస్తోంది.

ఇవీచూడండి:క్రమంగా పెరుగుతోన్న గోదారి నీటిమట్టం

ABOUT THE AUTHOR

...view details