Godavari Floods In Telangana : గోదావరి ఉద్ధృతికి ఈ ఏడాది కూడా నదీ పరివాహక ప్రాంతాల వాసులు బెంబేలెత్తిపోయారు. గతేడాది జులైలో వచ్చిన భారీ వరద ప్రజలు తీవ్రంగా నష్టపోయేలా చేసింది. మళ్లీ తాజాగా అదే నెలలో వచ్చిన ఎగువ ప్రాంత వరద వారి జీవితాలను చిన్నాభిన్నం చేసి దెబ్బతీసింది. ఇలా తరచూ దెబ్బమీద దెబ్బపడి కోలుకోలేకుండా చేస్తూ.. వారికి కన్నీటిని మిగుల్చుతోంది. గత ఐదు దశాబ్దాల నుంచి వచ్చిన గోదావరి వరదను పరిశీలిస్తే.. సరాసరిన ప్రతి రెండేళ్లకోసారి నదీ పరివాహకంలో ఉన్న నిర్మల్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని గ్రామాలకు తీవ్ర సమస్యగా వేధిస్తోంది.
2022 జులైలో వచ్చిన వరదలను ప్రజలు ఇప్పటికీ మరచిపోవడం లేదు. ఇదిలా ఉంటే గోదావరి భద్రాచలం వద్ద ఎప్పుడు వరదలు వచ్చినా.. పరవళ్లు తొక్కుతుంది. అందుకు అధికారులు అక్కడ 43 అడుగుల మట్టం దాటితే మొదటి ప్రమాద హెచ్చరికను.. 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరికను.. 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ఈ హెచ్చరికల్లో తొలి రెండు హెచ్చరికల స్థాయిల వరకు గోదావరి పొంగినా ముంపు ప్రాంత ప్రజలు తట్టుకోగలుగుతున్నారు. కానీ మూడో ప్రమాద స్థాయి ఎప్పుడైతే దాటుతుందో.. ఆ ఉద్ధృతిని తట్టుకోలేకపోతున్నారు.
Godavari Floods : ప్రజలు గ్రామాలను ఖాళీ చేసి.. పునరావాస కేంద్రాలకు వెళ్లడం, ఇంటిని, ఇళ్లలో ఉన్న వస్తువులను, పంటలను, పశుసంపదను, డబ్బును కోల్పోతుండటంతో ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగులుతోంది. ప్రతిసారీ ఇలానే వరద ముంచెత్తడంతో.. ఆర్థికంగా కుదురుకోలేక అప్పుల పాలైపోతున్నారు. ఇక అన్నదాతల పరిస్థితి చూస్తే.. మరీ దీనం.