Godavari Flood Effect:ఇళ్ల చుట్టూ చెరువుల్ని తలపించేలా వరద.. నివాసాల్లో బురద.. స్లాబులపైకీ ఉప్పొంగి వచ్చిన గోదారి ప్రవాహం.. పలు జిల్లాల్లో రెండు పడక గదుల ఇళ్ల సముదాయాల్లో కనిపించిన దృశ్యాలివి. కొట్టుకుపోయిన ఇంటి సామగ్రి, విద్యార్థుల సర్టిఫికెట్లు, బ్యాంకు పాసుపుస్తకాలు, రేషన్‌కార్డులు.. విద్యుత్ సౌకర్యంలో సమస్యలు, నివాసాల్లోకి చేరిన పాములు, తేళ్లు.. ఇలా ఒక్కో ఇంట్లో ఒక్కో సమస్యతో లబ్ధిదారులు గొల్లుమంటున్నారు. గోదావరి వరద తాకిడికి, భారీ వర్షాల ప్రభావానికి లోనైన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో పలుచోట్ల ఈ పరిస్థితి నెలకొంది.
తోడుతున్న కొద్దీ నీటిఊట..మహబూబాబాద్ జిల్లా కురవిలో 30 ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు ఇచ్చారు. ఇక్కడ చెరువు దగ్గర లోతట్టులో ఇళ్లు కట్టారు. వరదతో పక్కనే ఉన్న చెరువులో చేపలు ఇళ్ల ముందుకు రాగా.. యువకులు వలలతో పట్టారు. పంచాయతీ అధికారులు నీళ్లు తోడిస్తున్నా.. ఇళ్ల మధ్య నీరు ఊరుతూనే ఉంది. కరెంటు సౌకర్యం లేకపోవడంతో చీకట్లోనే మగ్గతున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు.
* ములుగు జిల్లా మంగపేట మండలం చెరుపల్లిలో 20 డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టి లబ్ధిదారులకు అందించారు. స్థలం కొరత ఉండటంతో ఇక్కడ లబ్ధిదారులే ఇళ్ల స్థలాలను కొనుగోలుచేశారు. పక్కనే తిమ్మచెరువు ఉండటంతో వరదనీరు ఇళ్ల ముందు నిలుస్తోంది.